వైసీపీలో భారీ మార్పులు, చేర్పులు.. జగన్‌ చతుర్ముఖ వ్యూహం ఎలాంటి ఫలితం ఇవ్వనుంది?

www.mannamweb.com


Jagan Strategy : మార్పులు-చేర్పులు, మళ్లీ మార్పుల్లో మార్పులు చేస్తున్న సీఎం జగన్‌ వ్యూహం ఏంటి? ఇప్పటికే 58 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను మార్చిన సీఎం..
10 లోక్‌సభ స్థానాల్లోనూ కొత్త అభ్యర్థులను తెరపైకి తెస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనట్లు ఇన్ని మార్పులు చేస్తున్న సీఎం జగన్‌ రాజకీయాల్లో కొత్త ట్రెండ్‌ సృష్టిస్తున్నారా? జగన్‌ వ్యూహాలు పాలిటిక్స్‌లో రోల్‌ మోడల్‌గా నిలుస్తాయా? లేక లెర్నింగ్‌ మోడల్‌గా మారతాయా? నాలుగు ఆప్షన్లతో ముందకు కదులుతున్న జగన్‌ పన్నుతున్న చతుర్ముఖ వ్యూహమా ఇది?

జగన్ వ్యూహం.. ఎలాంటి ఫలితాలను ఇస్తుందో..
బలమైన ప్రత్యర్థిని తెలివితో, తెలివైన ప్రత్యర్థిని బలంతో.. కొట్టాలనేది యుద్ధనీతి! ఈ యుద్ధనీతిని ఆసాంతం ఒంటపట్టించుకున్న వైసీపీ అధినేత జగన్‌ గడిచిన ఐదేళ్లలో ఇటు బలంతో, అటు తెలివితో తెలుగుదేశం పార్టీని.. ఇతర ప్రధాన ప్రత్యర్థులనూ మట్టి కరిపించేందుకు విశ్వప్రయత్నం చేశారు. చాలావరకు లేదా, కనీసం కొంతవరకు తన ప్రయత్నంలో సఫలీకృతమయ్యారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. జగన్‌మోహన్‌రెడ్డి రానున్న ఎన్నికల కోసం వినూత్న రీతిలో చేస్తున్న ప్రయోగం.. కొత్త చర్చకు తెరలేపింది. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై జగన్‌ అనుసరిస్తున్న ఈ వినూత్న వ్యూహం ఎలాంటి ఫలితాలను ఇస్తుందోనని ఆ పార్టీలోనూ భిన్నాభిప్రాయాలను లేవనెత్తుతోంది.
అభ్యర్థుల ఎంపికలో జగన్‌ అనుసరిస్తున్న చతుర్ముఖ వ్యూహంలో ప్రధాన అంశాలు ఇవి…
1. నియోజకవర్గంలో జనం నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను నిర్మొహమాటంగా మార్చేయడం.
2. ఇలా సిట్టింగ్‌ స్థానాల నుంచి మారక తప్పని పరిస్థితులను ఎదుర్కొంటున్న వారు.. ఎంతోకొంత శక్తిసామర్థ్యాలను కలిగి, పార్టీకి ఉపయోగపడతారని భావించినప్పుడు.. వారిని మరో కొత్త అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దించడం.
3. కొందరు సిట్టింగ్‌ ఎంపీలను ఎమ్మెల్యేలుగా, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను ఎంపీలుగా బరిలోకి దించడం.
4. పెద్దగా ఉపయోగం లేదని భావించిన వారిని పూర్తిగా ఎన్నికల బరి నుంచి తప్పించివేయడం.
బహుశా జగన్‌ చేస్తున్న ఈ ప్రయోగం.. ఇంతవరకు ఏ ఇతర రాజకీయ పార్టీ చేయలేదేమో!

26మందిని పూర్తిగా పక్కన పెట్టేసిన జగన్..
ఈ ప్రయోగం ఫలితంగా.. ఇప్పటివరకు 58 ఎమ్మెల్యే స్థానాల్లో, 10 ఎంపీ స్థానాల్లో మార్పులు, చేర్పులు చేశారు. 28 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో.. ఇద్దరికి రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని హామీ ఇచ్చి, మిగతా 26 మందిని మాత్రం పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇదంతా ఇప్పటివరకు ప్రకటించిన నాలుగు జాబితాల్లోనే.. రానున్న రోజుల్లో కొత్తగా మరిన్ని మార్పులు జరుగుతాయేమో చూడాలి. ఒక అంచనా ప్రకారం మరో 15 స్థానాల వరకు మార్పులు ఉండవచ్చని అంటున్నారు.

అభ్యర్థిపై జనంలో వ్యతిరేకత లేకపోతే చాలనే భావన..
జగన్‌ చేస్తున్న ఈ ప్రయోగం వెనుక ఒక బలమైన నమ్మకం ఉంది. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత తన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రయోజనం పొందిన బలహీన వర్గాల నుంచి, తనకు బలమైన ఓటు బ్యాంకు ఏర్పడిందని జగన్‌ బలంగా నమ్ముతున్నారు. బలహీన వర్గాలకు అధికారంలో భాగస్వామ్యం కల్పిస్తూ తాను అనుసరిస్తున్న సామాజిక న్యాయవ్యూహానికి.. ఆ వర్గాల వారి నుంచి బాగా మద్దతు లభిస్తుందని కూడా జగన్‌ ఆశిస్తున్నారు.

వీటివల్ల మొత్తం ఓట్లలో 45శాతం వరకు తనకు ఓటు బ్యాంకుగా మారిపోయిందని జగన్‌ విశ్వసిస్తున్నారు. ఇంత బలమైన ఓటు బ్యాంకు తనతో ఉన్నందున.. తన పార్టీ తరఫున ఎన్నికల్లో నిలబడే అభ్యర్థికి జనంలో వ్యతిరేకత లేకపోతే చాలు, వైసీపీ గెలుపు ఖాయమనేది జగన్‌ వేస్తున్న లెక్కల్లోని కీలకాంశం! ఒక రకంగా చూస్తే.. ఇది కరెక్టే అనిపిస్తోంది. అయితే నాణేనికి మరోవైపున కూడా చూడాలి.

కొత్త అభ్యర్థి విజయం కోసం పని చేయడం కష్టమే..
ఎమ్మెల్యేగా గెలుపొంది.. ఐదేళ్లుగా అధికారంలో ఉన్న ఎవరికైనా.. ఒక్కసారి రంగం నుంచి నిష్క్రమించాల్సివస్తే చాలా కష్టంగా ఉంటుంది. రాజకీయ అధికార వ్యసనమే అలాంటిది. ఈ పరిస్థితుల్లో.. తనను కాదని, వేరేవారికి టికెట్‌ కేటాయిస్తే… ఆ కొత్త అభ్యర్థి విజయం కోసం పని చేయాలన్న వినయ విధేయతలు, పార్టీ పట్ల నిబద్ధత ఉన్న రాజకీయ నేతలు ఎందరు ఉన్నారు ఈ కాలంలో!?

అలాంటి విశాల దృక్పథం ఉన్న నాయకులు ఎందరు?
ఇక, ఇప్పటివరకు నియోజకవర్గంతో సంబంధం లేని వ్యక్తి వచ్చి అక్కడ అభ్యర్థిగా నిలబడితే, తనను కాదని వచ్చిన వారి విజయం కోసం పనిచేయాలన్న విశాల దృక్పథం ఉన్న నాయకులు ఎందరు ఉన్నారు ఈ కాలంలో!? తనదే అనుకున్న సీటు, తనదే అనుకున్న అధికారాన్ని.. తన కళ్ల ముందే వేరొకరికి దక్కే అవకాశం ఉంటే.. వారికి ఆ అవకాశం ఇచ్చే పరిస్థితి నిజంగా నేటి రాజకీయ నాయకుల్లో ఉందా?

వ్యతిరేకత పాపం తమది కాదంటున్న సీటు దక్కని ఎమ్మెల్యేలు..
ఈ కారణాల వల్లే… టికెట్‌ తమకు రాదని భావిస్తున్న నాయకుల్లో… కొందరు పక్క పార్టీల వైపు చూస్తుంటే, మరికొందరు పరిస్థితిని గమనిస్తూ.. భవిష్యత్‌ కార్యాచరణ వ్యూహంలో సిద్ధమవుతున్నారు. ఇందువల్లే.. మార్పులు జరిగిన పలుచోట్ల రచ్చ జరుగుతోంది. కొందరు సిట్టింగులైతే అధినేత మీద విమర్శలు మొదలుపెట్టారు. తమపట్ల నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందన్న విమర్శను ఎదుర్కొంటున్న వారంతా చెబుతున్న ఒక ముఖ్య అంశం కూడా విస్మరించలేనిదిగా కనిపిస్తోంది.

తాము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ, తమ చేతిలో పెద్దగా అధికారం లేదని.. దాంతో నియోజకవర్గంలోని జనానికీ, పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులకు, కార్యకర్తలకూ తాము పెద్దగా ఉపయోగ పడలేకపోయామని, అందువల్లే తమ పట్ల వ్యతిరేక భావం ఉన్నట్లు కనిపిస్తోందని.. ఈ పాపం తమది కాదని టికెట్‌ దొరకని పలువురు నాయకులు అంటున్నారు.
అధికారంలో ఉన్నా ప్రయోజనం పొందలేదనే నిరాశ..
సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు నేరుగా జగన్‌ ఓటు బ్యాంకుగా మారారని అనుకుంటే.. అధికారంలో ఉన్న పార్టీ వల్ల ప్రయోజనం పొందలేని ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని.. వారు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే తమకు మేలు జరుగుతుందని 2019 ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన ద్వితీయశ్రేణి నాయకుల్లో పలువురు ప్రస్తుతం నిరాశతో ఉన్నారని అంటున్నారు.

అంతుచిక్కని జగన్ వ్యూహం..
వాస్తవానికి చెప్పాలంటే.. ద్వితీయ శ్రేణి నాయకులే కాదు.. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ప్రధానమైన నేతలు కూడా ఇదేరకమైన విమర్శలు చేస్తున్నారు. కర్నూలు ఎంపీ డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మార్పుల ఎఫెక్ట్‌తో పార్టీకి రాజీనామా చేశారు. ఈ ముగ్గురిలో బాలశౌరికి సీఎం జగన్‌తో సన్నిహిత సంబంధాలు ఉండేవని చెప్పేవారు. ఇక లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా అధిష్టానంతో సత్సంబంధాలే నెరిపే వారు. ఇలాంటి వారు ఆకస్మికంగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం, అంతకుముందే వారికి ప్రత్యామ్నాయంగా కొత్త నేతలను సీఎం జగన్‌ సిద్ధం చేయడం చూస్తుంటే.. ఆయన వ్యూహం ఏ ఒక్కరికీ అంతుచిక్కడం లేదు.

అభివృద్ధిపై మధ్యతరగతి జనాల్లో అసంతృప్తి..
మార్పులతో ఎదురుదెబ్బలు తగులుతున్నట్లు కనిపిస్తున్నా.. ఎక్కడా చలించడం లేదు సీఎం జగన్‌. ఇంకా మరిన్ని మార్పులు ఉన్నాయంటూ సంకేతాలివ్వడంతో పాటు, మార్చిన వారికి టికెట్‌ గ్యారెంటీ లేదని చెబుతుండటంతో పార్టీపై పూర్తిస్థాయిలో పట్టునిలుపుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు.

మరోవైపు సీఎం చేపట్టిన మార్పులను జీర్ణించుకోలేని సిట్టింగ్‌లు కొందరు కొత్త వాదన తెరపైకి తెస్తున్నారు. వ్యతిరేకత తమపై కాదని.. రోడ్ల నిర్వహణ, విద్యుత్‌ చార్జీల పెంపు, ఇసుక, లిక్కర్‌ పాలసీ వల్ల సాధారణ జనంలో వ్యతిరేక భావం వచ్చిందని వారంతా చెబుతున్నారు. సంక్షేమం విషయంలో బాగానే ఉన్నా.. అభివృద్ధిలో రాష్ట్రం వెనకబడిందనే అభిప్రాయం మధ్యతరగతి ప్రజల్లో ఏర్పడిందని.. సీట్లు రాని పలువురు సిట్టింగు ఎమ్మెల్యేలు చెబుతున్నారు.

అయితే వైసీసీ పార్టీ వ్యూహకర్తలు మాత్రం దీన్ని కొట్టిపడేస్తున్నారు. ‘వోకల్‌ సెక్షన్స్‌’ తమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా.. నిజమైన ‘ఓటు బ్యాంకు’ తమవైపు ఉందని, ఇదే తమకు విజయం చేకూర్చుతుందని వారు అంటున్నారు. జగన్‌ పట్ల పేద ప్రజల్లో ఉన్న అభిమానమే ఆయన్ను వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తుందని, ఈ లక్ష్యంలో భాగంగా తమ పార్టీ అభ్యర్థుల పట్ల జనంలో వ్యతిరేకత లేకుండా చూడాల్సిన పరిస్థితి వల్లే.. తప్పనిసరి పరిస్థితుల్లోనే.. జగన్‌ పలుచోట్ల అభ్యర్థులను మార్చక తప్పడం లేదని, ఆ పార్టీ వ్యూహకర్తలు అంటున్నారు.

ఏది ఏమైనా భారీ సంఖ్యలో అభ్యర్థుల మార్పులు-చేర్పులు ద్వారా జగన్‌ చేస్తున్న ఈ ప్రయోగం విజయవంతమైతే మాత్రం ఆయన పలు పార్టీలకు ‘రోల్‌ మోడల్‌’ అవుతారు. లేకపోతే మాత్రం ‘లెర్నింగ్‌ మోడల్‌’ అవుతారు. ఈ రెండింటిలో ఏది జరుగుతుందో తేలాలంటే మరో 3 నెలలు వేచి చూడాల్సిందే.