‎శివాలయానికి వెళ్ళినప్పుడు మొదటి నవగ్రహాలు లేదా గణపతి ఏ దేవుడిని పూజించాలి?

మామూలుగా తరచుగా శివాలయానికి వెళుతూ ఉంటారు. ముఖ్యంగా సోమవారం రోజు ఎక్కువగా వెళుతూ ఉంటారు. ఈరోజున శివుడికి అంకితం చేయబడింది కాబట్టి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ శివాలయానికి వెళ్లినా కూడా అక్కడ విగ్నేశ్వరుడితో పాటు నవగ్రహాలు కూడా తప్పనిసరిగా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు మొదటి విఘ్నేశ్వరుని పూజించాలా లేదంటే నవగ్రహాలను పూజించాలా అన్న సందేహం చాలా మందికి కలిగే ఉంటుంది. మరి ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. దోష నివారణ కోసం నవగ్రహాలకు ప్రదక్షిణాలు, పూజలు చేస్తుంటారు.

‎ అయితే ఈ నవగ్రహాలు ప్రధానంగా శివాలయాల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. శివాలయం దర్శించడానికి వెళ్ళినప్పుడు ముందుగా శివుణ్ణి దర్శించాలా, లేక నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయాలా? అనే సందేహాలు వస్తుంటాయి. నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో అధిష్టాన దేవత ఉంటుంది. ఆ దేవతలను నియమించింది శివుడే. దీంతోపాటు నవగ్రహాలకు అధిపతి అయిన సూర్యదేవునికి ఆది దేవత కూడా శివుడే. ఈ కారణంగానే గ్రహాలన్నీ కూడా శివుడి ఆదేశానుసారమే సంచరిస్తూ ఉంటాయి. అందువల్లనే శివాలయాల్లో నవగ్రహ మంటపాలు ఎక్కువగా దర్శనమిస్తూ ఉంటాయి. అయితే ఆది దేవుడైన పరమశివుడి అనుగ్రహమే ఉంటే నవగ్రహ దోషాలు ఎలాంటి ప్రభావం చూపలేవని పండితులు చెబుతున్నారు.

‎అందుకే శివాలయాల్లో నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయకపోయినా శివునికి మాత్రం కచ్చితంగా అభిషేకం లేదా అర్చన చేయించడం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయట. అయితే ఇది కేవలం మినహాయింపు మాత్రమే అని నవగ్రహ దోషాలతో ముఖ్యంగా ఏలినాటి శని. అర్ధాష్టమ శని వంటి దోషాలతో ఇబ్బంది పడేవారు కచ్చితంగా నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయాల్సిందే అని చెబుతున్నారు. శివాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా శివుని దర్శించాలా? లేక నవగ్రహాలను దర్శించాలా? అంటే పరమేశ్వరుడు ఆది దేవుడు, లోక పాలకుడు. సకల గ్రహాలకు కర్తవ్వాన్ని బోధించేది శివుడు. అందుకే ముందుగా పరమేశ్వరుని దర్శించుకోవాలట. ఈ విషయం తెలియక నవగ్రహాలను దర్శించినా, ఆ పరమ శివుడి అనుగ్రహానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. అలాగే శివుణ్ణి ముందు దర్శించినా నవగ్రహాలు తమ ఆది దేవుణ్ణి ముందుగా కొలిచినందుకు సంతోషించి తమ అనుగ్రహాన్ని కూడా ప్రసాదిస్తాయట. అసలు ఏ దేవాలయానికి వెళ్లినా ముందుగా గణపతికి నమస్కరించాలట.

‎ఆ తర్వాత శివుని దర్శించి 11 ప్రదక్షిణాలు చేసి అనంతరం నవగ్రహ మంటపానికి చేరుకోవాలని, నవగ్రహాలకు సంబంధించిన శ్లోకాలు చదువుతూ 9 ప్రదక్షిణలు సవ్య దిశలో చేసి, తరువాత మరో రెండు ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయాలట. అంటే మొత్తం 11 ప్రదక్షిణాలు నవగ్రహాలకు కూడా చేయాలని నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసిన తర్వాత తప్పకుండా మళ్లీ శివ దర్శనం చేయాలని, అప్పుడే నవగ్రహ ప్రదక్షిణాలు చేసిన ఫలం దక్కుతుందని ఇది శివాలయంలో నవగ్రహాలను దర్శించాల్సిన పద్ధతి అని చెబుతున్నారు. ఒకవేళ తొందరలో ఉంటే ముందుగా గణపతికి, శివునికి నమస్కరించి తరువాత నవగ్రహాలను కూడా దర్శించి ఒకసారి నమస్కరించి, అనంతరం శివాలయంలో తీర్థం, విభూతి తీసుకుని ఇంటికి వెళ్ళవచ్చట. శివాలయానికి వెళ్ళినప్పుడు అనవసర సందేహాలను పక్కన పెట్టి భక్తిశ్రద్ధలతో మనసారా స్మరిస్తే సకల దోషాలు తొలగిపోయి శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.