సిట్‌ సభ్యులు మాచర్ల ఎందుకు వెళ్లలేదు?

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజు, ఆ మర్నాడు పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు నియమించిన సిట్‌.. అసలు మాచర్ల పట్టణానికి వెళ్లలేదని తెలుస్తోంది. మాచర్లలో తెదేపా నేత కేశవరెడ్డి ఇంటిపై వైకాపా నాయకులు దాడి చేశారు. అయిదు వాహనాల్లో వచ్చి ఢీకొట్టిపోయారు. ఘటనలో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. మాచర్ల మండలం కంభంపాడులో రోడ్డుపైనే పోలీసులున్నా కర్రలతో కొట్టుకున్నారు. వెల్దుర్తి మండలం కేపీ గూడెంలో పోలింగ్‌ ఏజెంట్లుగా కూర్చున్న తెదేపావారిపై దాడులకు తెగబడ్డారు. పోలింగ్‌ సరళిని పరిశీలించడానికి వెళ్లిన కాంగ్రెస్‌ అభ్యర్థి రామచంద్రారెడ్డిపైనా దాడి చేశారు. వైకాపా నేత, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సొంతూరు వెల్దుర్తి మండలం కండ్లకుంటలో అయితే తెదేపా ఏజెంట్లుగా కూర్చున్న వారి కుటుంబసభ్యులపై దాడులకు తెగబడ్డారు. మాచర్లలో తెదేపా అభ్యర్థి బ్రహ్మారెడ్డి కారును తగలబెట్టారు. ఇలాంటి ఘటనలెన్నో మాచర్ల, వెల్దుర్తి మండలాల్లో చోటుచేసుకున్నా సిట్‌ సభ్యులు పర్యటించకపోవడం గమనార్హం. కేవలం కారంపూడి, రెంటచింతల ఠాణాల్లో ఎఫ్‌ఐఆర్‌ పత్రాలను పరిశీలించి, ఆపై ఘటనా స్థలాలను చూసి వెళ్లిపోయారు. మాచర్లకు సిట్‌ సభ్యులు వచ్చారా? రాలేదా? అనే విషయమై మాచర్ల గ్రామీణ సీఐ సురేష్‌ యాదవ్, టౌన్‌ సీఐ బ్రహ్మయ్యలను ‘ఈనాడు’ సంప్రదించగా, ఎవరూ రాలేదని సమాధానమిచ్చారు. ఎక్కువ అల్లర్లు జరిగిన ప్రాంతాలను పరిశీలించకుండా నివేదిక ఇవ్వడంపై ప్రతిపక్ష నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


సోమవారం మూడోరోజు సిట్‌ సభ్యులు నరసరావుపేట టూటౌన్‌ పోలీసుస్టేషన్‌లో పలు పత్రాలు పరిశీలించారు. పెండింగ్‌ అరెస్టులపై ఆరాతీసినట్టు సమాచారం. నరసరావుపేట గ్రామీణ పరిధిలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పమిడిపాడు ఘటనకు సంబంధించి జనసేన, తెదేపా నేతలను అరెస్టు చేసినట్టు తెలిసింది. టూటౌన్‌ పరిధిలో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని సీఐ భాస్కర్‌ తెలిపారు. ఏయే పార్టీల వారిని, ఎంతమందిని అరెస్టుచేశారనే విషయాలను కూడా పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.