ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుమారుడికి గాయాలు.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. పవన్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లోని ఓ స్కూల్ లో అగ్నిప్రమాదానికి గురై గాయపడ్డాడు.
ఈ ఘటనపై పవన్ ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. ఇదే ఘటనపై అటు సెలబ్రిటీలు, ఇటు రాజకీయ నాయకులు పవన్ కల్యాణ్ పై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అసలు మార్క్ శంకర్ పవన్ ఏ భార్య కొడుకు..? సింగపూర్ లో ఎందుకు ఉన్నాడు..?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుమారుడు 8 ఏళ్ల మార్క్ శంకర్ సింగపూర్‌లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు కావడంతో పాటు పొగ పీల్చడం వల్ల బాలుడు స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం సింగపూర్‌లోని ఓ ఆసుపత్రిలో అతనికి చికిత్స అందిస్తున్నారు.
1997లో తొలి వివాహం..
అయితే ప్రస్తుతం మార్క్ శంకర్ పవన్ ఏ భార్య కొడుకో చాలామందికి ప్రశ్నార్థకంగా మారింది. ఆ వివరాలు ఓ సారి చూస్తే.. పవన్ కల్యాణ్ 1997లో తొలి వివాహం చేసుకున్నారు. నందిని అనే ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో రెండేళ్లు మాత్రమే కలిసి ఉన్నారు. అలా 2008లో అధికారికంగా విడిపోయారు. వీరికి ఎలాంటి సంతానం లేదు.
రేణు దేశాయ్‌కి దగ్గర..
2008లో నందినితో అధికారికంగా విడాకులు తీసుకున్నారు పవన్. ఆ తర్వాత నటి రేణు దేశాయ్‌కు దగ్గరయ్యారు. వీరిద్దరు చాలా సంవత్సరాల పాటు కలిసి సహజీవనం చేశారు. 2009లో రేణు దేశాయ్, పవన్ అధికారికంగా పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. అయితే పెళ్లికి ముందే అకీరా పుట్టాడు. ఆ తర్వాత ఏడాదికి ఆధ్య జన్మించింది. అయితే 2012లో రేణు దేశాయ్, పవన్ కల్యాణ్ విడిపోయారు. ప్రస్తుతం అకీరా, ఆధ్య రేణు దేశాయ్ వద్దే ఉంటున్నారు.
రష్యా నటితో పవన్ ప్రేమ..
రేణు దేశాయ్ తో విడాకుల అనంతరం రష్యాకు చెందిన నటి అన్నా లెజ్ నేవాతో ప్రేమలో పడ్డారు పవన్. 2013లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కూతురు పేరు పోలేనా అంజనా పవనోవిచ్ తోపాటు కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్. తాజాగా గాయపడ్డ గాయపడ్డ మార్క్ శంకర్ పవనోవిచ్.. అన్నా లెజ్‌నేవా కొడుకు. మార్క్ శంకర్ అందరికంటే చిన్నవాడు కావడం విశేషం.
అయితే ప్రస్తుతం పవన్ కల్యాణ్ మూడో భార్య అన్నా లెజ్‌నేవా సింగపూర్‌లో చదువుకుంటుంది. దీంతో కుమారుడు మార్క్ శంకర్ కూడా అక్కడే చదువుకుంటున్నాడు. అంతేకాక వీరికి సింగపూర్ లో బిజినెస్‌లు కూడా ఉన్నాయట. వాటన్నింటినీ అన్నా లెజ్‌నేవా చూసుకుంటుందని సమాచారం. మార్క్ శంకర్ ప్రస్తుతం రివర్ వాలీ కుకింగ్ స్కూల్‌లో చదువుకుంటున్నాడని టాక్.