హైదరాబాద్ నగర వాసులకు ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయా?
నగరంలో వాహనాల రద్దీ గణనీయంగా తగ్గనుందా? ప్రయాణ సమయం బాగా ఆదా కానుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజినల్ రింగ్ రోడ్ వరకు అన్ని దిశలకు కనెక్టివిటీ పెంచే లక్ష్యంతో భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది హెచ్ఎండీఏ.
ఇందులో భాగంగా కొత్తగా మరో ట్రంపెట్ ఫ్లైఓవర్ నిర్మాణానికి హెచ్ఎండీఏ సన్నాహాలు చేస్తోంది. బుద్వేల్ లేఔట్ దగ్గర అంతర్జాతీయ ప్రమాణాలతో ట్రంపెట్ జంక్షన్ నిర్మాణానికి సిద్ధమైంది. హైదరాబాద్ నగరం నుంచి నేరుగా ఔటర్‌ను కలుపుతూ దీన్ని నిర్మించనున్నారు. బుద్వేల్ లేఔట్ నుంచి ఓఆర్ఆర్, రేడియల్ రోడ్2కు లింక్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ చేపట్టనున్నారు. దీంతో రాబోయే రోజుల్లో నగరం నుంచి నేరుగా ఔటర్ వరకు.. అక్కడి నుంచి రేడియల్ రోడ్ల మీదుగా ట్రిపుల్ ఆర్ వరకు ప్రయాణాలు ఈజీ కానున్నాయని అధికారులు వెల్లడించారు.
ఇప్పటికే కోకాపేటలోని నియోపోలిస్‌లో ట్రంపెట్ ఫ్లైఓవర్ నిర్మించిన సంగతి తెలిసిందే. అదే తరహాలో రేడియల్ రోడ్-2ను ఔటర్ రింగ్ రోడ్ 143వ కిలోమీటర్ దగ్గర కలిసేలా కొత్త ట్రంపెట్ నిర్మించనున్నారు. కోకాపేట ట్రంపెట్ కారణంగా నగరంలోని పలు ప్రాంతాల నుంచి శంకర్‌పల్లి వైపు ట్రాఫిక్ గణనీయంగా తగ్గినట్లే, బుద్వేల్ ట్రంపెట్ తో కూడా అదే స్థాయిలో ప్రయోజనం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఓఆర్ఆర్ వరకు కనెక్టివిటీని పెంచేందుకే ఈ కొత్త ప్రాజెక్ట్ చేపట్టనున్నట్టు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.
ఈ ట్రంపెట్ నిర్మాణానికి 488 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో, ఆధునిక సాంకేతికతతో దీన్ని నిర్మించనున్నారు. బుద్వేల్ లేఔట్‌తో పాటు రానున్న మూసీ నది రివర్ఫ్రంట్కూ కనెక్టివిటీని అందిస్తుందంటున్నారు.
”ట్రంపెట్ నిర్మాణంతో రేడియల్ రోడ్2, ఓఆర్ఆర్, గచ్చిబౌలి, ఓఆర్ఆర్-శంషాబాద్-రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్, బుద్వేల్ మధ్య ట్రాఫిక్ సమస్యలు తీరుతాయి. ట్రంపెట్ మీద ఎలాంటి అంతరాయాలు లేకుండా వాహనదారులకు ప్రయాణ సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాం. ప్రాజెక్ట్ డీపీఆర్ పూర్తయ్యింది. టెండర్ దశలో ఉంది” అని అధికారులు తెలిపారు.

































