మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్లకు కొన్ని రకాల జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మహిళలు ఆరోగ్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంత ఆరోగ్యంగా ఉన్నట్లు అనిపించినా, వయసు రీత్యా కొన్ని ఆరోగ్య పరీక్షలు ఏడాదికొకసారైనా చేసుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.
ముఖ్యంగా నలభై ఏళ్లలోకి అడుగుపెట్టిన స్త్రీలు కొన్ని టెస్టులు తప్పనిసరిగా చేసుకోవాలి. దీనివల్ల పలు దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధులను త్వరగా గుర్తించి బయటపడే వీలుంది.
రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, మంచి డైట్ తీసుకున్నంత మాత్రాన ఏ జబ్బూ రాదనుకుంటే పొరపాటు. ఏ కారణం చేతైనా రోగాలు చుట్టుముట్టే అవకాశం ఉంది. అందుకే నలభై ఏళ్లలోకి అడుగుపెట్టగానే మహిళలు కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాలి. రాబోయే జబ్బుల్ని ముందుగానే గుర్తిస్తే. వాటి నుంచి బయటపడొచ్చు. అందుకు వైద్య నిపుణులు సూచిస్తున్న కొన్ని పరీక్షలివి.
మమ్మోగ్రామ్
నలభై ఏళ్లలోకి అడుగు పెట్టిన మహిళలు రెండేళ్లకొకసారైనా మమ్మోగ్రామ్ చేయించుకోవాలి. మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్‌కు గురవుతున్న సగటు వయసు యాభై నుంచి డెబ్బై నాలుగేళ్లు. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ సూచన ప్రకారం 45-54 ఏళ్ల మహిళలు ఏడాదికోసారి, యాభై ఐదేళ్లు పైబడిన వాళ్లు రెండేళ్లకోసారి మమ్మోగ్రామ్ పరీక్షలు చేయించుకోవాలి. ఈ టెస్టుల వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పును త్వరగా తెలుసుకోవచ్చు.
కంటి పరీక్షలు
సాధారణంగా నలభై ఏళ్లు పైబడిన మహిళల్లో కంటికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కంటి చూపు మందగించడం, తలనొప్పి వంటివి రావొచ్చు. కనీసం రెండేళ్లకోసారైనా కంటి పరీక్షలు నిర్వహించుకోవడం వల్ల కంటి చూపు బాగుండేలా చూసుకోవచ్చు. 65 ఏళ్లు పైబడితే గ్లకోమా, మాక్యులర్ డీజనరేషన్ వంటి జబ్బులు రావొచ్చు. అందువల్ల ఈ వయసు మహిళలు ప్రతి ఏడాది కంటి పరీక్షలు చేయించుకోవాలి.
షుగర్ టెస్ట్
నలభైల్లోకి అడుగుపెట్టగానే బ్లడ్ గ్లూకోజ్ పరీక్షలు చేయించుకోవాలి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. మధుమేహం వచ్చే అవకాశం
ఉందా లేదా అనే సంగతిని ముందుగానే గుర్తించి, జాగ్రత్త పడొచ్చు. రెండు, మూడేళ్లకోసారైనా ఏ1సీ వంటి టెస్టులు చేయించుకోవాలి.
హెపటైటిస్-సి
1945- 65 మధ్య జన్మించిన వాళ్లను ‘బేబీ బూమర్స్’ అంటారు. అప్పట్లో సరైన ‘హెపటైటిస్-సి’ వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడం వల్ల బేబీ బూమర్స్‌కు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అందువల్ల ఈ కాలంలో జన్మించిన వాళ్లు మాత్రమే కాకుండా యాభై ఏళ్లు పై బడిన వాళ్లు తప్పనిసరిగా హెపటైటిస్-సి టెస్టులు చేయించుకోవాలి.
వినికిడి పరీక్షలు
యాభై ఏళ్లు పైబడిన వాళ్లలోని నలభై శాతం మందిలో వినికిడి శక్తి కొంత తగ్గిపోతుంది. అందువల్ల వినికిడి పరీక్షలు చేయించుకోవడం వల్ల ఈ సమస్యలు దరి చేరకుండా నియంత్రించుకోవచ్చు.
థైరాయిడ్
ఈ రోజుల్లో ముప్పై, నలభై ఏళ్ల వయసు వారిని కూడా థైరాయిడ్ సమస్యలు వేధిస్తున్నాయి. అందులోనూ అరవై ఏళ్లు పైబడిన వాళ్లకు థైరాయిడ్ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని వయసు పైబడిన వాళ్లు ఈ హార్మోన్ పరీక్షలు నిత్యం చేయించుకుంటూ ఉంటే ఆరోగ్యంగా ఉండొచ్చు.
బోన్ మెజర్మెంట్
వయసు పైబడుతున్న కొద్దీ ఎముకలు పెళుసుగా మారుతుంటాయి. దీంతో చిన్న గాయాలకే ఎముకలు విరిగిపోతాయి. అందువల్ల నలభై, యాభై సంవత్సరాల వయసున్న వాళ్లు ‘డ్యుయల్ ఎనర్జీ ఎక్స్-రే లేదా డీఎక్స్పో’ వంటి పరీక్షలు చేయించుకోవాలి. ఎముకలు ఎంత బలంగా ఉన్నాయో వీటి వల్ల తెలుస్తుంది. లోపాలేమైనా ఉంటే వైద్యుల సలహాలు తీసుకోవాలి. అరవై అయిదేళ్లు పైబడిన వాళ్లు ఆస్టియోపొరోసిస్ పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి.
బీపీ- కొలెస్ట్రాల్ పరీక్షలు
చిన్నవయసు వాళ్లు కూడా బీపీ బారిన పడుతున్న రోజులివి. అందువల్ల నలభై ఏళ్లు వచ్చిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా బీపీ చెక్ చేసుకోవాలి. దీనితోపాటు కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకు ని ఎల్డీఎల్, హెచ్ఎఎల్ ఎంత శాతం ఉందో తెలుసుకోవాలి.