YSRCP: ఏపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన వైసీపీ-ఆ రెండేనా కారణాలు ?

ఏపీలో తొలి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. రెండు రోజుల పాటు జరుగుతున్న సమావేశాల్లో భాగంగా నిన్న తొలిరోజు సభ్యుల ప్రమాణస్వీకారాలు కొనసాగాయి.


అయితే మరో ముగ్గురు ఎమ్మెల్యేలు వివిధ కారణాలతో అసెంబ్లీ సమావేశాలకు రాలేకపోవడంతో వారితో ఇవాళ ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించనున్నారు. దీంతో పాటు స్పీకర్ గా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడు బాధ్యతలు చేపట్టే కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో వైసీపీ సభను బాయ్ కాట్ చేసింది.

నిన్న అసెంబ్లీకి హాజరై ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు ఇవాళ మాత్రం సభకు హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్లాలని నిర్ణయించారు. దీంతో ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి హాజరు కావడం లేదు. మరోవైపు ఇవాళ అసెంబ్లీకి గైర్హాజరు కావాలన్న వైసీపీ నిర్ణయం వెనుక రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి.

ఇందులో ఇప్పటికే తమ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కూడా అయిన వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే చింతకాయల అయన్నపాత్రుడును స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్న నేపథ్యంలో.. అసెంబ్లీకి వెళ్లి కూడా తమకు న్యాయం జరగదని వైసీపీ బావిస్తోంది. స్పీకర్ గా అయన్న ఉంటే తమకు న్యాయం జరగదని జగన్ ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేల భేటీలో చెప్పేశారు.

ఇలాంటి వ్యక్తిని స్పీకర్ చేయడమేంటని కూడా ప్రశ్నించారు. అలాగే గతంలో తమ ప్రభుత్వ హయాంలో కేటాయించుకున్న భూముల్లో నిర్మిస్తున్న పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఇవాళ ఉదయం సీఆర్డీయే అధికారులు కూల్చివేయడంపై వైసీపీ ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తోంది.