Former Minister Yerneni Sita Devi Passed Away : మాజీ మంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి తుదిశ్వాస విడిచారు. సోమవారం ఉదయం హైదరాబాద్ లో ఆమె గుండెపోటు కారణంగా మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
యెర్నేని సీతాదేవి స్వస్థలం ఏపీలోని కైకలూరు మండలంలో ఉన్న కోడూరు గ్రామం. ఆమె ముదినేపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే 1988లో ఎన్టీఆర్ కేబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారామె.
ఆ తర్వాత బీజేపీలో చేరారు. సీతాదేవి మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా.. ఆమె కుటుంబం రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే. భర్త నాగేంద్రనాథ్ అలియాస్ చిట్టిబాబు ఏపీ రైతాంగ సమాఖ్య, కొల్లేరు పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిగా, కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టా డ్రైనేజీ బోర్డు సభ్యునిగా పనిచేశారు. గతేడాదే ఆయన మరణించారు. చిట్టిబాబు సోదరుడు దివంగత యెర్నేని రాజారామచందర్ కూడా 2 పర్యాయాలు కైకలూరు ఎమ్మెల్యేగా గెలిచారు. రాజా సీతాదేవి, చిట్టిబాబు దంపతులకు ఒక కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు.