ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాదాబైనామాలకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ భూములు క్రమబద్ధీకరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమబద్ధీకరణ ద్వారా, రిజిస్ట్రేషన్ చేయని భూమి కొనుగోలు పత్రాలైన తెల్ల కాగితాలపై వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.
ప్రభుత్వం 2024 జూన్ 15 వరకు జరిగిన కొనుగోళ్లను పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ పథకం కింద అర్హులైన రైతులు 2027 డిసెంబర్ 31 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా, ఈ క్రమబద్ధీకరణలో భాగంగా రైతులకు స్టాంపు డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజుల నుండి మినహాయింపు (2024 జూన్ 15 నాటికి లావాదేవీలు జరిగి, సాదాబైనామాలు రాసుకున్న భూములపై) లభిస్తుంది. అంటే భూమిపై హక్కులు పొందడానికి వారు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది రైతులకు ఆర్థికంగా ఎంతో ఉపశమనం కలిగిస్తుంది.
గతంలో కూడా ప్రభుత్వం పలుమార్లు సాదాబైనామాల క్రమబద్ధీకణకు అవకాశం కల్పించింది. అయితే ఆ గడువు 2023 డిసెంబర్ 31తో ముగిసిపోయింది. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, వారి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని, ప్రభుత్వం ఈ గడువును మరోసారి పొడిగించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల ఎంతో మంది రైతులు తమ భూములపై చట్టబద్ధమైన హక్కులను పొందగలుగుతారు.
ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ సాదాబైనామాల భూముల క్రమబద్ధీకరణకు సంబందించి మార్గదర్శకాలు జారీచేశారు. క్రమబద్దీకరణకు సంబంధించి దరఖాస్తు అందిన తర్వాత 90 రోజుల్లోగా పరిష్కరించాలని ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. విచారణ తర్వాత సబ్‌రిజిస్ట్రార్ దగ్గర అసలు ఒప్పంద (అన్‌రిజిస్టర్డ్) పత్రాల్ని దాఖలు చేయాలని.. అలాగే సర్టిఫికెట్ జారీచేసి రైతులకు ఇవ్వాలని కూడా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ‘దరఖాస్తు పరిష్కరించడం అంటే తుది ఉత్తర్వులు ఇవ్వడమేనని, లేదంటే పెండింగ్‌లో ఉన్నట్లే’ అని కూడా తెలిపారు.
సాదాబైనామాల క్రమబద్ధీకరణ కేవలం గ్రామీణ ప్రాంతాల్లోని సాగు భూములకు మాత్రమే వర్తిస్తుంది. ఈ క్రమబద్ధీకరణ పథకం గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు తమ భూములను క్రమబద్ధీకరించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. చిన్న రైతులు అంటే 2.5 ఎకరాల మాగాణి లేదా 5 ఎకరాల మెట్ట భూమి ఉన్నవారు. సన్నకారు రైతులు అంటే 1.25 ఎకరాల మాగాణి లేదా 2.5 ఎకరాల మెట్ట భూమి ఉన్నవారు ఈ పథకానికి అర్హులు.
రైతుకు ఉన్న మొత్తం భూమిని లెక్కించేటప్పుడు, వారు సాదాబైనామాల ద్వారా పొందిన భూమిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అంటే, రైతు పేరు మీద ఉన్న సొంత భూమితో పాటు, సాదాబైనామాల ద్వారా పొందిన భూమిని కలిపి అర్హతను నిర్ణయిస్తారు. క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఆధీనంలోనే ఆ భూమి ఉండటం తప్పనిసరి. అంటే, ఆ భూమిని ప్రస్తుతం ఆయనే సాగు చేసుకుంటూ ఉండాలి. అడంగల్‌లో అనుభవదారుగా నమోదై ఉంటే, అది భూమిపై వారి హక్కుకు సరిపోతుంది. దీనికి ఇతర ఆధారాలు పెద్దగా అవసరం లేదు. ఒకవేళ అడంగల్‌లో అనుభవదారుగా నమోదు లేకపోయినా, లేదా రికార్డులు సరిగా లేకపోయినా, కొన్ని ఇతర ఆధారాలను పరిగణనలోకి తీసుకుంటారు. శిస్తు రసీదులు, అంటే భూమిపై పన్ను కట్టిన రసీదులు, అలాగే ఈ-క్రాప్‌లో నమోదు వివరాలను పరిశీలించి అర్హతను నిర్ధారిస్తారు. ఈ విధంగా, సాదాబైనామాల క్రమబద్ధీకరణ ప్రక్రియను సులభతరం చేశారు.
సాదాబైనామాల క్రమబద్దీకరణకు రైతులు తమ మండలంలోని మీసేవ, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫామ్-10తో పాటు దరఖాస్తు చేసుకోవాలి. భూములు కొనుగోలు చేసినవారు లేదా అమ్మినవారు ఈ దరఖాస్తులను సమర్పించవచ్చు ఈ దరఖాస్తులను అధికారులు పరిశీలించి, జీవో ప్రకారం చర్యలు తీసుకుంటారు. స్థానిక తహసీల్దార్ ఈ సాదాబైనామాల రిజిస్ట్రేషన్ల గురించి నోటిఫికేషన్ జారీ చేస్తారు. రైతుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించడంతో పాటు, ఊరూరా ప్రచారం కూడా నిర్వహిస్తారు. ప్రభుత్వం ఈ దరఖాస్తులను రైతులు సమర్పించిన 90 రోజుల్లోగా పరిష్కరించాలని గడువు విధించింది. “ఫస్ట్ కమ్ ఫస్ట్” విధానంలోనే దరఖాస్తులను పరిష్కరించాలని, ఇందులో ఎలాంటి మినహాయింపులకు తావులేదని ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.



































