ప్రస్తుత కాలంలో ట్రావెలింగ్ అంటే చాలా మంది ఇష్టపడుతున్నారు. బిజీ బిజీ వర్క్ షెడ్యూల్‌లో చిన్న గ్యాప్ దొరికినా.. ఎక్కడికో ఓ చోటుకు టూర్ వేసేస్తున్నారు.
సెలవులను బట్టి దగ్గరి, దూర ప్రయాణాలను అప్పటికప్పుడు ప్లాన్ చేస్తున్నారు. ఇక కొంత మంది ఉద్యోగాలు వదిలేసి మరీ ట్రావెల్ వ్లాగర్లుగా మారిపోయి.. ప్రపంచ దేశాలను చుట్టేస్తున్నారు. అయితే ఎంత ట్రావెల్ లవర్స్ అయినా.. ప్రపంచం మొత్తం చుట్టి రావాలి అనే కోరిక ఉంటుంది. అలాంటి కోరికను నెరవేర్చేందుకు ఒక సంస్థ ముందుకు వచ్చింది. మహారాష్ట్ర రాజధాని ముంబై నుంచి ప్రపంచ యాత్ర చేపట్టాలనుకునే వారికి ది క్యూ ఎక్స్‌పీరియన్సెస్ అనే సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. ఒక ప్రైవేటు జెట్ విమానంలో కేవలం 23 రోజుల్లోనే ప్రపంచంలోనే అత్యద్భుతమైన 7 దేశాలను తిప్పి చూపించనుంది.
ది క్యూ ఎక్స్‌పీరియన్సెస్ వరల్డ్ టూర్‌కు సంబంధించిన లగ్జరీ ప్యాకేజీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ది క్యూ ఒడిస్సీ పేరుతో ఈ రాయల్ టూర్ కమ్ వరల్డ్ టూర్‌ను ఆ సంస్థ ఏర్పాటు చేస్తోంది. ఈ 23 రోజుల ప్రపంచ యాత్రకు ఒక వ్యక్తికి అయ్యే టికెట్ ఖర్చు రూ. 99 లక్షలుగా ది క్యూ ఎక్స్‌పీరియెన్సెస్ సంస్థ ప్రకటించింది. ఈ ప్రయాణం ఈ ఏడాది జూన్ 6వ తేదీన ముంబైలో ప్రారంభమై.. తిరిగి జూన్ 28వ తేదీన ముంబైలోనే ముగుస్తుందని తెలిపింది. అంటే భారత్ నుంచి బయలుదేరి మళ్లీ భారత్‌కే చేరుకునే పూర్తిస్థాయి ప్రపంచ పర్యటన ఇది అని వెల్లడించింది.
ఏ ఏ దేశాలు సందర్శించవచ్చు?
ఈ ప్యాకేజీలో భాగంగా ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, ఆసియా ఖండాల్లోని 7 విభిన్న దేశాలను చుట్టి రావచ్చని ది క్యూ ఎక్స్‌పీరియెన్సెస్ సంస్థ తెలిపింది.మాల్టా
మాల్టా దేశంలోని ప్రముఖ నగరమైన వాలెట్టాలోని చారిత్రక వీధులు, తీర ప్రాంతాలను 3 రోజులు చూడవచ్చు.మొరాకో
మొరాకోలోని మరకేచ్ నగరంలో ఉండే ఆఫ్రికా సంస్కృతి, రంగురంగుల మార్కెట్లను 3 రోజులు ఆస్వాదించవచ్చు.గ్రీన్‌లాండ్
గ్రీన్‌లాండ్‌లోని నూక్‌లో ఉండే మంచు కొండలు, ప్రకృతి అందాల మధ్య మరో 3 రోజుల పర్యటన.అమెరికా
అమెరికాలోని అలస్కాలో ఉండే అడవి మృగాలు, గ్లేసియర్లను 3 రోజులు చూడవచ్చు.దక్షిణ కొరియా
దక్షిణ కొరియాలో ఆధునికత, సాంప్రదాయాల కలయికగా ఉండే సియోల్‌లో 3 రోజులు పర్యటించవచ్చు.మంగోలియా
మంగోలియాలోని గోబి ఎడారి ప్రాంతం, అక్కడి ప్రత్యేక సంస్కృతిని మరో 3 రోజులు ఆస్వాదించవచ్చు.చైనా
చైనాలోని లిజియాంగ్‌లో ఉండే పురాతన కట్టడాలు, సంస్కృతిని వీక్షించి చివరి 3 రోజులు గడిపి ముంబైకి చేరుకుంటారు.ప్రైవేట్ జెట్‌లో లగ్జరీ సౌకర్యాలు
ఈ ప్రపంచ యాత్రలో ప్రయాణమంతా ఒక ప్రత్యేక ప్రైవేట్ జెట్‌లో జరుగుతుంది. విమానంలోనే బెడ్స్ వంటి సౌకర్యాలతో పాటు ఇతర విలాసవంతమైన ఏర్పాట్లు ఉంటాయి. సెలబ్రిటీ ఇండియన్ షెఫ్ విక్కీ రత్నాని స్వయంగా ఈ ప్రయాణంలో రుచికరమైన భారతీయ, శాకాహార వంటకాలను అందిస్తారు. ప్రయాణికుల ఆరోగ్యం కోసం విమానంలో నిరంతరం ఒక డాక్టర్ అందుబాటులో ఉంటారు. వరల్డ్ టూర్‌లోని మధుర జ్ఞాపకాలను ఫోటోలు, వీడియోల రూపంలో భద్రపరచడానికి ఒక ప్రొఫెషనల్ ఫిలిం మేకర్ బృందం మీతోనే ఉంటుంది. సామాన్లు మోయడానికి పోర్టర్లు, లాండ్రీ సర్వీస్, స్థానిక గైడ్ల సేవలు ప్యాకేజీలోనే ఉంటాయి.

































