సిమ్ కార్డ్ లేకుండానే వీడియోలు చూసేయొచ్చు : డీ2ఎం బ్రాడ్‌కాస్టింగ్ దిశగా కేంద్రం , ఎలా పనిచేస్తుందంటే..?

www.mannamweb.com


మొబైల్ వినియోగదారులు త్వరలో సిమ్ కార్డ్ లేకుండా ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా వీడియోలను వీక్షించవచ్చు. ఎందుకంటే సమీప భవిష్యత్తులో డైరెక్ట్ టు మొబైల్ ప్రసారాలు అందుబాటులోకి రానున్నాయి.
బ్రాడ్ కాస్టింగ్ సమ్మిట్‌ను ఉద్దేశించి కేంద్ర సమాచార, ప్రసార కార్యదర్శి అపూర్వ చంద్ర మాట్లాడుతూ.. దేశీయంగా అభివృద్ధి చేసిన డైరెక్ట్ టు మొబైల్ (డీ2ఎం) సాంకేతికతకు సంబంధించిన ట్రయల్స్ త్వరలో దేశంలోని 19 నగరాల్లో జరుగుతాయని చెప్పారు. ఇందుకోసం 470-582 MHz స్పెక్ట్రమ్ రిజర్వ్ చేయడానికి బలమైన గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్లు అపూర్వ తెలిపారు.

డీ2ఎంకి వీడియో ట్రాఫిక్‌ను 25 నుంచి 30 శాతం మార్చడం వల్ల 5జీ నెట్‌వర్క్‌లు అన్‌లాగ్ అవుతాయని అపూర్వ చంద్ర అన్నారు. తద్వారా దేశ డిజిటల్ పరిణామాన్ని వేగవంతం చేసి కంటెంట్ డెలివరీని మరింత అందుబాటులోకి తెస్తుందన్నారు. గతేడాది డీ2ఎం సాంకేతికతను పరీక్షించడానికి పైలట్ ప్రాజెక్ట్‌లు బెంగళూరు, కర్తవ్య పథ్, నోయిడాలో జరిగాయి. డీ2ఎం టెక్నాలజీ దేశవ్యాప్తంగా దాదాపు 8 నుంచి 9 కోట్ల టీవీ డార్క్ ఇళ్లను చేరుకోవడానికి సహాయపడతాయని చంద్ర తెలిపారు. దేశంలోని 280 మిలియన్ల కుటుంబాలలో కేవలం 190 మిలియన్లకు మాత్రమే టెలివిజన్ సెట్లు వున్నాయి.

దేశంలో 80 కోట్ల స్మార్ట్‌ఫోన్లు వున్నాయని, 69 శాతం కంటెంట్ వీడియో ఫార్మాట్‌లోనే వుందని అపూర్వ చెప్పారు. వీడియోను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మొబైల్ నెట్‌వర్క్‌లు అడ్డుపడతాయని , దీని ఫలితంగా కంటెంట్ బఫర్ అవుతుందని చంద్ర తెలిపారు. సాంఖ్య ల్యాబ్స్ , ఐఐటీ కాన్పూర్ అభివృద్ధి చేసిన డీ2ఎం ప్రసార సాంకేతికత భూ సంబంధమైన టెలికమ్యూనికేషన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ అసైన్డ్ స్పెక్ట్రమ్ ద్వారా వీడియో, ఆడియో, డేటా సిగ్నల్‌లను నేరుగా అనుకూల మొబైల్ లేదా స్మార్ట్ పరికరాల నుంచి స్ట్రీమ్ చేసుకోవచ్చు.
ఒక బిలియన్ మొబైల్ డివైస్‌లను చేరుకోగల సామర్ధ్యంతో డీ2ఎం సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడం వలన డేటా ట్రాన్స్‌మిషన్ , యాక్సెస్‌లో ఖర్చు తగ్గింపులు, నెట్‌వర్క్ సామర్ధ్యం, దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ ఏర్పాటు వంటి వాటి ఏర్పాటుకు దారి తీయడం వంటి ప్రయోజనాలను పొందవచ్చు.