YS Jagan Foreign Tour: జగన్ విదేశీ పర్యటనపై సీబీఐ కోర్టు నిర్ణయం ఇదే..!

ఏపీ సీఎం వైఎస్ జగన్ నిన్న మొన్నటివరకూ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ప్రచారం, వ్యూహాలతో బిజీబిజీగా గడిపారు.
ఈ నేపథ్యంలో జగన్ కు ఆయన కుటుంబంతో గడిపేందుకు కూడా తీరిక లేకుండాపోయింది. ఇప్పుడు ఎన్నికల పోలింగ్ ముగిసిపోవడంతో ఇక కౌంటింగ్ వరకూ విశ్రాంతి లభించింది. దీంతో ఆయన కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు సిద్దమయ్యారు. అయితే అక్రమాస్తుల కేసులో బెయిల్ పై ఉన్న ఆయన విదేశీ టూర్ కు అనుమతిపై సీబీఐ కోర్టు ఇవాళ నిర్ణయం తీసుకుంది.


అక్రమాస్తుల కేసులో గతంలో ఇచ్చిన బెయిల్ షరతుల్లో భాగంగా విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి. దీంతో జగన్ ఎన్నికలకు ముందే హైదరాబాద్ సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు..సీబీఐ అభిప్రాయం కోరింది. సీబీఐ మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అక్రమాస్తుల కేసులో కీలక విచారణ జరుగుతున్న సమయంలో జగన్ విదేశాలకు వెళ్లిపోతే ఇబ్బంది అని అభ్యంతరం తెలిపింది. దీంతో సీబీఐ కోర్టు నిర్ణయం వాయిదా వేసింది.
ఇవాళ హైదరాబాద్ సీబీఐ కోర్టు.. జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకూ విదేశాల్లో పర్యటించేందుకు ఆయనకు అనుమతి ఇచ్చింది. లండన్ తో పాటు యూరప్ దేశాల్లో కుటుంబ సభ్యులతో ఆయన పర్యటించబోతున్నారు. లండన్ లో ఉన్న కుమార్తె వద్దకు వెళ్లి అక్కడి నుంచి మిగతా దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. అయితే ఎన్నికల కౌంటింగ్ కు మూడు రోజుల ముందు ఆయన రాష్ట్రానికి తిరిగి రానున్నారు.