Witnesses are dying – హైకోర్టులో వైఎస్ సునీత పిటిషన్

న్యాయం చేయాలని.. కేసు విచారణ పూర్తి చేయాలని కోర్టుల్ని వేడుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. తన తండ్రిని అత్యంత ఘోరంగా చంపేసిన వారు హాయిగా బయట తిరుగుతున్నారని ప్రస్తుతం ఆ కేసుపై విచారణ కూడా జరగడం లేదని ..


వైఎస్ వివేకా కుమార్తె సునీత ఆవేదన చెందుతున్నారు. తాజాగా ఆమె తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ట్రయల్ ప్రారంభం కాకుండా చేస్తున్నారని.. ఆరు నెలల్లో ట్రయల్‌ మొత్తం పూర్తిచేసేలా నాంపల్లి సీబీఐ కోర్టుకు ఆదేశాలు జారీచేయాలని పిటిషషన్‌లో కోరారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు బదిలీ అయి రెండేళ్లు దాటినా ఇంకా కేసు ట్రయల్ ప్రాథమిక దశలోనే ఉందని పిటిషన్‌లో కలిపారు. సీబీఐ సమర్పించిన డిస్కుల్లో 13 లక్షల ఫైల్స్‌ ఉండగా ఇప్పటివరకు 13,717 ఫైల్స్‌ మాత్రమే ఓపెన్‌ చేశారన్నారు. రోజుకు 500 ఫైల్స్‌ చొప్పున ఓపెన్‌ చేసుకుంటే పోతే మరో ఏడేళ్లయినా ట్రయల్‌ ప్రారంభం కాదని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు.

సునీత పిటిషన్‌లో కీలక విషయాలను పేర్కొన్నారు. సాక్షులు వరుసగా చనిపోతున్నారని గుర్తు చేశారు. సాక్షి వైఎస్‌ అభిషేక్‌రెడ్డి తాజాగా మరణించారని తెలిపారు. ట్రయల్‌ ప్రారంభం కాకపోతే ఇబ్బందులు వస్తాయన్నారు. ఈ పిటిషన్‌పై కోర్టు ఫిబ్రవరి నాలుగో తేదీన విచారణ జరపనున్నారు. వైఎస్ వివేకా కేసును కూడా జగన్ అక్రమాస్తుల కేసు తరహాలో కోల్డ్ స్టోరేజీలో పెట్టించడానికి న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాలను నిందితులు వాడుకుంటున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.