Transfers: AP ఉద్యోగులకు జీరో సర్వీసెస్‌ బదిలీలు?

ఐఏఎస్, ఐపీఎస్ వంటి వారి లానే సాధారణ ఉద్యోగులకు కుడా జీరో సర్వీసులతోనే బదిలీల ప్రక్రియ చేపట్టాలని చంద్రబాబు నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.


ఈ నెల 12న చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుంది. ఈ నెల 20 తర్వాత బదిలీల ప్రక్రియ చేపట్టనున్న సంగతి తెలిసిందే. జీరో సర్వీసెస్ విధానంలో ప్రభుత్వం పరిపాలనాపరంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తహశీల్దార్‌ కంటే పైస్థాయి అధికారుల పోస్టులను బదిలీ చేసుకునే అవకాశం ఉంది.

సర్వీసు నిబంధనల ప్రకారం అటెండర్ ఉద్యోగులకు తహసీల్దార్ స్థాయి కేడర్‌కు ఏటా 20 శాతానికి మించకుండా బదిలీ చేసే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంది. అయితే కొంతకాలంగా అది అమలు కావడం లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో చాలా కాలంగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ నుంచి మినహాయింపునిస్తే.. ఉద్యోగుల్లో ప్రభుత్వం పట్ల సానుకూల దృక్పథం ఏర్పడిన సంగతి తెలిసిందే.

2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐదు నెలల క్రితం తహసీల్దార్లను ఒక జిల్లాకు కేటాయించారు. దీంతో ఆయా ఉద్యోగులు గత ఐదు నెలలుగా కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో ఇతర జిల్లాలకు బదిలీ అయిన ఉద్యోగులు తమను గత జిల్లాలకు బదిలీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఇదే అంశంపై ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ ప్రతినిధి బృందం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నిరబ్‌కుమార్‌ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేసింది.

ఇటీవల టీచర్ల బదిలీలకు సంబంధించిన ఫైలుపై ఆరోపణలు రావడంతో టీచర్ల బదిలీలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కొత్త ప్రభుత్వం జీరో సర్వీసుల బదిలీలు అమలు చేస్తే రెవెన్యూ, పోలీసు, ఉపాధ్యాయ, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు కిందిస్థాయి కేడర్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఊరట లభిస్తుందని కార్మిక సంఘాలలో చర్చ జరుగుతోంది.

జీరో సర్వీస్ అంటే ఏమిటి ?

జీరో సర్వీసెస్ అంటే ఏ స్థాయిలో పనిచేసిన ఉద్యోగి అయినా సర్వీసు కాల వ్యవధి తో సంబంధం లేకుండా బదిలీ చేయవచ్చు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఎప్పుడైనా బదిలీ చేసుకునే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంది. కింది స్థాయి ఉద్యోగులకు కొన్ని నియమాలు వర్తిస్తాయి. ఏడాదిలో 20 శాతానికి మించి సిబ్బందిని బదిలీ చేయకూడదు.