ఏపీలో హైవేలపై 18 ఫ్లైఓవర్ల నిర్మాణం: కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

www.mannamweb.com


ఏపీలో జాతీయ రహదారులపై రూ.1,046 కోట్ల నిధులతో చేపట్టిన 18 ఫ్లైఓవర్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని కేంద్ర రహదారి, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) తెలిపారు.

లోక్‌సభలో వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ‘ఎన్‌హెచ్‌-216ఎపై మోరంపూడి, జొన్నాడ, ఉండ్రాజవరం జంక్షన్, తేతలి, కైకరం వద్ద నిర్మిస్తున్న 5 వంతెనలు 2025 ఏప్రిల్‌ 2 నాటికి పూర్తవుతాయి.

ఎన్‌హెచ్‌-16పై గొలగమూడి జంక్షన్, నెల్లూరు టీ జంక్షన్‌ల వద్ద నిర్మిస్తున్న రెండు వంతెనలు 2025 సెప్టెంబర్‌ 11కి, విశాఖపట్నం ఎయిర్‌పోర్టు జంక్షన్‌ వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్‌ 2025 ఫిబ్రవరి 15కి, గుంటూరు మిర్చియార్డు వద్ద నిర్మిస్తున్న వంతెన జనవరి 6వ తేదీకల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎన్‌హెచ్‌-16పై నాగులుప్పలపాడు గ్రోత్‌సెంటర్, రాజుపాలెం జంక్షన్‌ల వద్ద తలపెట్టిన వంతెనల నిర్మాణాలకు అనుమతి లేఖలు ఇచ్చాం. ఇదే హైవేలో రాజుపాలెం క్రాస్‌రోడ్డు, జొన్నతాళి క్రాస్‌రోడ్డు, చెవ్వూరు క్రాస్‌రోడ్డు, రణస్థలం టౌన్‌ పోర్షన్‌తో పాటు ఎన్‌హెచ్‌-44పై కియా వద్ద తలపెట్టిన ఫ్లైఓవర్ల నిర్మాణాలకు బిడ్లు పిలిచాం. ఎన్‌హెచ్‌-16లో శ్రీసిటీ జీరో పాయింట్, చిల్లకూరు సెంటర్‌ల వద్ద తలపెట్టిన ఫైఓవర్ల నిర్మాణాలకు బిడ్లు పిలవాల్సి ఉంది’ అని గడ్కరీ వివరించారు.