SIM Cards Block: పాకిస్తాన్‌లో 5 లక్షల మంది సిమ్ కార్డులు బ్లాక్.. ఎందుకో తెలుసా..?

Pakistan: పాకిస్థాన్‌లో 5 లక్షల మందికి పైగా సిమ్ కార్డులు బ్లాక్ కాబోతున్నాయి. పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ నంబర్లను బ్లాక్ చేయాలని పాకిస్థాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీని ఆదేశించింది. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయని వారిపై ఈ చర్య తీసుకోనున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ప్రధాని షాబాజ్ షరీఫ్ ప్రసంగించిన ఒక రోజు తర్వాత ఈ చర్య తీసుకోబడింది.


కాగా, రియాద్‌లో జరిగిన గ్లోబల్ బాడీ ఫోరమ్‌లో ప్రధాని షాబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి పాకిస్తాన్ ఖర్చులను తగ్గించిందని అన్నారు. అంతే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను సంక్షోభం నుంచి గట్టెక్కించేలా అనేక ఆర్థిక సంస్కరణలు చేశామన్నారు. ప్రభుత్వ వినియోగదారులే కాకుండా ఇతర కంపెనీల కస్టమర్లకు చెందిన సిమ్ కార్డులను బ్లాక్ చేయాలని పాకిస్థాన్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ టెలికమ్యూనికేషన్ అథారిటీని కోరింది. ఎన్నో హెచ్చరికలు చేసినా ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయని వారిపై ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ఇక, ఆదాయపు పన్నులు చెల్లించని 5 లక్షల 6 వేల మందిపై ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. మే 15లోగా ఈ 5 లక్షల మందిపై చర్యలు తీసుకోవాలని టెలికాం శాఖను పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కోరారు. దేశ ప్రజలు నిజాయితీగా పన్ను కట్టాల్సిన అవసరం ఉందని షాబాజ్ ప్రభుత్వం చెబుతోంది. పాకిస్థాన్‌లో 2023 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కేవలం 45 లక్షల మంది మాత్రమే ఐటీఆర్‌ను దాఖలు చేయగా.. 2022లో ఆ సంఖ్య 59 లక్షలకు పైగా ఉంది. ఆదాయపు పన్ను చెల్లించని వ్యక్తులపై పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు కఠిన చర్యలకు దిగడానికి ఇదే కారణం.