Monsoon: చల్లని కబురు.. కేర‌ళ‌లోకి ప్రవేశించిన రుతుపవనాలు! మరో 2 రోజుల్లోనే ఏపీకి ఆగమనం

www.mannamweb.com


Monsoon: చల్లని కబురు.. కేర‌ళ‌లోకి ప్రవేశించిన రుతుపవనాలు! మరో 2 రోజుల్లోనే ఏపీకి ఆగమనం
ఈ ఏడాది మండుటెండలకు ప్రజలు బెంబేలెత్తిపోయారు. మునుపటి కంటే తీవ్ర స్థాయిలో భానుడు ప్రతాపం చూపాడంతో ప్రజలతోపాటు మూగజీవాలు కూడా అల్లాడిపోయాయి. తాజాగా వాతావరణ శాఖ వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించే చల్లని కబురు వినిపించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రుతుపవనాలు ఈ రోజు కేరళలో అడుగుపెట్టాయి. రుతుపవనాలు గురువారం ఉదయం కేరళను తాకినట్లు ఐఎండీ అధికారికంగా వెల్లడించింది. దీంతో ఆ రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మీదుగా వీచిన రెమల్ తుఫాను రుతుపవన ప్రవాహాన్ని బంగాళాఖాతం వైపు మళ్లించిందని, దీని ప్రభావంతో రుతుపవనాలు కేరళలో ప్రవేశించినట్లు పేర్కొంది.

కేరళతోపాటు లక్షద్వీప్‌లో రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 64.5 ఎంఎం నుంచి 115.5 ఎంఎం మ‌ధ్య వ‌ర్షపాతం న‌మోదు అయ్యే అవకాశం ఉన్నట్లు ఐఎంబీ వెల్లడించింది. కాగా ఇప్పటికే కేరళలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే మూడు, నాలుగు రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
మన దేశ ఆర్ధిక వ్యవస్థకు రుతుపవనాలు కీలక పాత్రపోషిస్తాయి. దేశ మొత్తం వ్యవసాయ ఉత్పత్తికి అవసరమైన 70 శాతం వర్షపాతం రుతుపవనాల ద్వారా లభిస్తుంది. సాధారణంగా ఇవి ప్రతీయేట జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు దేశ వ్యాప్తంగా విస్తరిస్తాయి. ఇక దేశంలోని కొన్ని ప్రాంతాలు మినహా మిగతా అన్ని చోట్ల సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.