చంద్రబాబు సర్కార్ ఉక్కు సంకల్పం.. నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

www.mannamweb.com


కొత్త పారిశ్రామిక పాలసీ తీసుకొచ్చాక ఏపీ సర్కార్ ఉక్కు సంకల్పంతో ముందుకెళ్తోంది. నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌ చేసింది. మొదటి దశకు అవసరమైన భూమిని కేటాయించింది. ప్రాజెక్టు పూర్తిచేయడానికి డెడ్‌లైన్ విధించింది.

కొత్త పారిశ్రామిక పాలసీ తీసుకొచ్చిన అనంతరం ఏపీలోని చంద్రబాబు సర్కార్ ఉక్కు సంకల్పంతో ముందుకెళ్తోంది. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధే ధ్యేయంగా.. పరిశ్రమలు, పెట్టుబడుల ఆకర్షణకు సీఎం చంద్రబాబు వ్యూహంతో ముందుకెళ్తున్నారు.. నక్కపల్లి మండలంలోని విశాఖ-చైన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో (వీసీఐసీ) పరిశ్రమల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది.. ఈ క్రమంలోనే నక్కపల్లి మెడలో స్టీల్ నగ చేరబోతోంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఆర్‌ సెల్లార్‌ మిట్టల్‌- నిప్పన్‌ స్టీల్‌ ఇండియా కలిసి ఉక్కు పరిశ్రమను స్థాపిస్తున్నాయి. లక్షా 35 వేల కోట్ల పెట్టుబడితో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుంది. స్టీల్ ప్లాంట్‌ ఏర్పాటు కోసం అవసరమైన భూములను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తొలిదశలో ప్రాజెక్టుకు 2 వేల 200 ఎకరాలు కేటాయించింది. రెండోదశకు అవసరమైన 3 వేల 800 ఎకరాల భూసేకరణకు ఏపీఐఐసీకి ఆదేశాలిచ్చింది. టౌన్ షిప్ ఏర్పాటు కోసం 440 ఎకరాల భూమి కేటాయించింది. రాయితీలు, ప్రోత్సాహకాలతో ప్యాకేజీ ప్రకటించింది. 2029 జనవరి నాటికి మొదటి దశ పూర్తిచేసేలా డెడ్‌లైన్ విధించింది. 2033 కల్లా రెండో దశ పూర్తి చేసేలా గడువు విధించింది ప్రభుత్వం..

11 వేల 198 కోట్లతో క్యాప్టివ్‌ పోర్టు నిర్మాణానికి అనుమతులిచ్చింది సర్కార్. మొదటిదశలో 2 బల్క్‌ బెర్తులు, రెండోదశలో 4 బల్క్‌ బెర్తులు నిర్మించనున్నాయి ఆర్‌ సెల్లార్‌ మిట్టల్‌- నిప్పన్‌ స్టీల్‌ప్లాంట్‌ కంపెనీలు. తొలిదశలో 3, రెండోదశలో 6 మల్టీపర్పస్‌ బెర్తులను నిర్మించనున్నారు. తొలిదశలో పోర్టుకు 148.26 ఎకరాలు, రెండోదశలో మరో 168 ఎకరాల భూమిని కేటాయించింది ప్రభుత్వం. తొలిదశలో 5 వేల ,816 కోట్లు, రెండోదశలో 5 వేల 382 కోట్లు వెచ్చించనున్నారు. ఈ క్యాప్టివ్‌ పోర్టు తొలిదశ పనులు జనవరి 2029 నాటికి, రెండోదశ పనులు 2033 నాటికి పూర్తిచేయాలని గడువు విధించింది చంద్రబాబు ప్రభుత్వం.

ప్రాజెక్టును త్వరతగతిన పూర్తిచేసేందుకు ప్రత్యేక అధికారిని నియమించింది ఏపీ ప్రభుత్వం. ఈ ప్రాజెక్టులతో మొత్తం 60 వేల మందికి ఉపాధి లభించనుంది.