టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ ధర రూ. 6.89 లక్షలు.. బాలెనో, గ్లాంజాకు ఇక కష్టకాలమే

భారతీయ కార్ల మార్కెట్‌లో టాటా మోటార్స్ తనదైన ముద్ర వేస్తోంది. ఇప్పుడు టాటాకు చెందిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు ‘అల్ట్రోజ్’ కొత్త రూపంలో (ఫేస్‌లిఫ్ట్ మోడల్) మార్కెట్లోకి వచ్చేసింది.


2020లో మొదటిసారి లాంచ్ అయిన అల్ట్రోజ్‌కు, ఇది మొదటి పెద్ద అప్‌డేట్. కొత్త డిజైన్, అధునాతన ఫీచర్లతో వచ్చిన ఈ కారు కస్టమర్లను ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

కొత్త అల్ట్రోజ్ 2025 ఫేస్‌లిఫ్ట్ ఫీచర్లు
కొత్త అల్ట్రోజ్ మొత్తం ఐదు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది: స్మార్ట్ (Smart), ప్యూర్ (Pure), క్రియేటివ్ (Creative), అకంప్లిష్డ్ ఎస్ (Accomplished S), అకంప్లిష్డ్ ప్లస్ ఎస్ (Accomplished Plus S). ఈ కొత్త అల్ట్రోజ్‌లో భద్రతకు టాటా మోటార్స్ చాలా ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో ఏకంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఇది ప్రమాదాల సమయంలో ప్రయాణికులకు మరింత రక్షణను అందిస్తుంది. వీటితో పాటు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), 3 పాయింట్ ELR సీట్ బెల్ట్ రిమైండర్ వంటి ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

అధునాతన ఫీచర్లు
సేఫ్టీతో పాటు, కారు నడిపే వారికి, ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా అనేక ఫీచర్లను జోడించారు. స్మార్ట్ డిజిటల్ స్టీరింగ్ వీల్, రిమోట్ కీ లెస్ ఎంట్రీ, అన్ని డోర్‌లకు పవర్ విండోస్, మల్టీ డ్రైవ్ మోడ్స్, ఐడిల్ స్టార్ట్/స్టాప్(ట్రాఫిక్‌లో ఆగినప్పుడు ఇంజిన్ ఆటోమేటిక్‌గా ఆగి, మళ్లీ స్టార్ట్ అవుతుంది. ఇది ఇంధనాన్ని ఆదా చేస్తుంది.)

ఇంజిన్, పనితీరు
కొత్త టాటా అల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో 1.2 లీటర్ రెవోట్రాన్ (Revotron) పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 200Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 12.8 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ట్రాన్స్‌మిషన్ విషయానికి వస్తే, 5 స్పీడ్ మ్యాన్యువల్, 5 స్పీడ్ ఆటోమేటిక్, 6 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో ఈ కారును కొనుగోలు చేయవచ్చు.

రంగులు, బూట్ స్పేస్
కొత్త టాటా అల్ట్రోజ్ మొత్తం 5 రంగులలో లభిస్తుంది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో 345 లీటర్ల బూట్ స్పేస్ (సామాన్లు పెట్టుకోవడానికి స్థలం) ఉంటుంది. సీఎన్‌జీ వేరియంట్లలో 210 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది.

ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ మార్పులు
కొత్త ఫ్రంట్ గ్రిల్, కొత్త ఫ్రంట్ బంపర్ కారుకు మరింత స్టైలిష్ లుక్ ఇస్తాయి. డ్యూయల్ టోన్ 16 అంగుళాల అల్లాయ్ వీల్స్ కారు అందాన్ని పెంచుతాయి. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఈ సెగ్మెంట్‌లో మొదటిసారిగా వస్తున్న ఫీచర్. డోర్ హ్యాండిల్స్ కారు బాడీతో సమానంగా ఉంటాయి. చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటాయి.

ఇంటీరియర్
ట్విన్ 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్: ఇది కారు లోపల ప్రధాన ఆకర్షణ. రెండు పెద్ద స్క్రీన్‌లు ఉంటాయి. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ , వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ , ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే , క్లైమేట్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫైయర్, రియర్ ఏసీ వెంట్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

ధర, బుకింగ్ వివరాలు
టాటా అల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ప్రారంభ ధర రూ. 6.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). టాప్ మోడల్ ధర రూ. 11.29 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఈ కొత్త అల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ కోసం బుకింగ్‌లు వచ్చే నెల జూన్ 2 నుండి ప్రారంభమవుతాయి. అయితే, కారు డెలివరీలు ఎప్పటి నుండి మొదలవుతాయో కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

ఈ ధరల శ్రేణిలో, టాటా అల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ కారు మారుతి సుజుకి బాలెనో (Maruti Suzuki Baleno), హ్యుందాయ్ ఐ20 (Hyundai i20), టయోటా గ్లాంజా (Toyota Glanza) వంటి కార్లకు గట్టి పోటీని ఇవ్వనుంది. మెరుగైన సేఫ్టీ, కొత్త ఫీచర్లతో అల్ట్రోజ్ ఈ సెగ్మెంట్‌లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటుందని ఆశిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.