ప్రస్తుతం సోషల్ మీడియా (Social media) యుగం నడుస్తోంది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు సోషల్ మీడియాకు బందీలుగా మారారు. ఈ నేపథ్యంలో అదేపనిగా సోషల్ మీడియా వాడితే అనర్థాలు తప్పవంటూ ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు.
మానసిక, శారీరక ఆరోగ్యం, సామాజిక సంబంధాలు, పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. అయితే పిల్లలపై సోషల్ మీడియా ప్రభావంపై తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. గంటల తరబడి సోషల్ మీడియాను వాడే పిల్లల్లో డిప్రెషన్ (Depression) లక్షణాలు ఎక్కువగా పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
ముఖ్యంగా 9 ఏళ్ల నుంచి 13 ఏళ్ల పిల్లలు సోషల్ మీడియాకు విపరీతంగా అడిక్ట్ అవుతున్నారని తాజా అధ్యయనం గుర్తించింది. రోజులో సగటున 7 నిమిషాల నుంచి 73 నిమిషాలకు పెరిగిందని, అదేవిధంగా వారిలో డిప్రెషన్ లక్షణాలు కూడా 35 శాతం పెరిగాయని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకుల అధ్యయనం పేర్కొంది. అంతేకాదు, సోషల్ మీడియాను అతిగా వాడుతున్న పిల్లల్లో నిరాశ, నిస్పృహ, విచారం, ఆసక్తి లేకపోవటం వంటి లక్షణాలు కూడా పెరుగుతున్నట్లు తెలిపింది. అయితే, మానసికంగా పిల్లల్లో ఎందుకు ఈ మార్పులు వస్తున్నాయన్నది అధ్యయనం స్పష్టంగా చెప్పలేకపోయింది. ఈ నేపథ్యంలో పిల్లలు పరిమిత సమయం మాత్రమే సోషల్ మీడియాలో గడిపేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.