ఆధార్​ అప్​డేట్​కు లాస్ట్​ ఛాన్స్!​ – ఈసారి చేసుకోకుంటే కార్డు పోయినట్టే

 ఆధార్​ కార్డును అప్​డేట్​​ చేయాలనుకునే వారికి గుడ్​న్యూస్. ఆధార్​ కార్డుల నవీకరణకు (అప్డేట్​కు) కేంద్రం మరో ఏడాది వరకు గడువు తేదీని పొడిగించింది. దీంతో వచ్చే ఏడాది జూన్‌ 30వ తేదీ వరకు ఆధార్‌ ఐడీని అప్డేట్​ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కూడా నిర్లక్ష్యం చేస్తే కార్డును సస్పెండ్‌ చేస్తారు. ఒక్కసారి ఆధార్‌కార్డు సస్పెండైతే దానిని పునరుద్ధరించుకోవడానికి పలు రకాల ధ్రువీకరణ పత్రాలు అందజేసి, మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కార్డుల అప్డేట్​ చేసుకునేందుకు కొందరు ఉత్సాహం చూపుతుండగా, అవగాహన లేని వారు మాత్రం అందుకు దూరంగా ఉంటున్నారు. మరికొందరు చరవాణిలో మై ఆధార్‌ యాప్‌ ద్వారా వివరాలను అప్​డేట్ చేసుకుంటున్నారు.


ప్రతీ పదేళ్లకు ఒకసారి : 10 ఏళ్ల క్రితం కార్డులను పొందిన వారందరూ ఆధార్‌కార్డు నవీకరించుకోవాలని యూఐడీఐ నుంచి కార్డుదారులకు సెల్​ఫోన్​లో సంక్షిప్త సందేశాలు అందుతున్నాయి. అప్పుడు ఊరూరా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి, ఆధార్‌ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేశారు. పదేళ్ల వరకు మాత్రమే కార్డులు చెల్లుబాటయ్యే విధంగా నిబంధనలు విధించారు. ప్రతీ పదేళ్లకు ఒకసారి ఆధార్‌ కార్డును నవీకరించుకోవాలని సూచించారు.

ఎంతో కీలకం : ప్రస్తుతం అన్నింటికీ ఆధార్‌కార్డు కీలకంగా మారింది. బ్యాంకు అకౌంట్లు తెరవడం, విద్యార్థుల అడ్మిషన్లు, పింఛన్లు, ఉద్యోగ నియామకాలు, రేషన్‌ కార్డులు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్​ ఫండ్, రైతు భరోసా, రైతు బీమా లాంటి ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ను తప్పనిసరి చేశారు. ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోకుంటే కొందరికి రేషన్, పింఛన్లు కూడా ఆగిపోతున్నాయి. కొందరు ఆధార్‌ ఐడీలు తీసుకున్నప్పటికీ అప్‌డేట్‌ చేసుకోలేకపోతున్నారు. ఇప్పటికే 2 మార్లు గడువు పొడిగించారు. ప్రస్తుతం 3వ సారి ఆధార్‌ నవీకరించుకోవడానికి కేంద్రం గడువు పొడిగించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.