ఆలూ గోబీ కేవలం ఒక కూర కాదు కొన్ని తరాలుగా మన ఇళ్లలో భాగమైపోయిన ఒక అనుభూతి. బంగాళదుంప మెత్తదనం, కాలీఫ్లవర్ కరకరలాడే స్వభావం, మసాలాల ఘుమఘుమల కలయికతో ఈ వంటకం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.
దీని తయారీ చాలా సులభం, పోషక విలువలు కూడా అధికం. ఇది రొట్టె, చపాతీ, నాన్, లేదా అన్నంతో కూడా చక్కగా సరిపోతుంది. రుచికరమైన ఆలూ గోబీ కూర ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
కాలీఫ్లవర్- 1 (సుమారు 500 గ్రాములు)
బంగాళదుంపలు- 2 పెద్దవి
ఉల్లిపాయ – 1 పెద్దది
టమాటాలు – 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
పచ్చి మిర్చి – 2
నూనె – 3 టేబుల్ స్పూన్లు
జీలకర్ర – 1 టీస్పూన్
పసుపు – అర టీస్పూన్
కారం – 1 టీస్పూన్
ధనియాల పొడి – ఒకటిన్నర టీస్పూన్
గరం మసాలా – అర టీస్పూన్
కసూరీ మేథీ- 1 టీస్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
కొత్తిమీర – గార్నిష్ కోసం
తయారీ విధానం
-ముందుగా కాలీఫ్లవర్ ను చిన్న చిన్న పువ్వులుగా విడదీయండి. ఒక గిన్నెలో గోరువెచ్చని నీరు తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి కాలీఫ్లవర్ ముక్కలను 10-15 నిమిషాలు నానబెట్టండి. తర్వాత నీటిని వడకట్టి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు బంగాళదుంపల తొక్క తీసి వాటిని కూడా మధ్యస్థ పరిమాణంలో ముక్కలుగా కోసి, నీటిలో వేసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు ఒక లోతైన పాన్ లేదా కడాయిని స్టవ్ మీద పెట్టి నూనె వేడి చేయండి. నూనె వేడెక్కాక, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి బంగారు రంగులోకి మారేంత వరకు వేయించండి.
-ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు వేయించండి. ఆ తర్వాత తరిగిన టమాటాలు లేదా టమాటా ప్యూరీ వేసి ఉప్పు కూడా జోడించండి. టమాటాలు మెత్తబడి నూనె మిశ్రమం నుండి వేరుపడేంత వరకు సుమారు 5-7 నిమిషాలు ఉడికించండి.
-ఇప్పుడు మంటను తగ్గించి అందులో పసుపు, కారం, ధనియాల పొడి వేసి ఒక నిమిషం పాటు వేయించండి.
-ఇప్పుడు బంగాళదుంప ముక్కలను వేసి మసాలాతో బాగా కలపండి. పాన్ పై మూతపెట్టి, 5-6 నిమిషాలు తక్కువ మంట మీద మగ్గనివ్వండి.
-తర్వాత కాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసి మసాలా మొత్తం ముక్కలకు పట్టేలా నెమ్మదిగా కలపండి. ఇప్పుడు పాన్ పై మూతపెట్టి తక్కువ మంట మీద 15-20 నిమిషాలు ఉడికించండి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండండి.
-అవసరమైతే కేవలం 2-3 టేబుల్ స్పూన్ల నీళ్లు చల్లండి. ఎక్కువ నీరు పోస్తే కూర ముద్దగా అవుతుంది.
-బంగాళదుంప, కాలీఫ్లవర్ ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత గరం మసాలా, నలిపిన కసూరీ మేథీ వేసి బాగా కలపండి. మరో రెండు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి.
-చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరతో అలంకరించాలి. అంతే ఆలూ గోబీ కర్రీ రెడీ.



































