తెలుగు రాష్ట్రాల్లో వంటగదుల్లో బీరకాయతో ఎన్నో రకాల వంటకాలు చేస్తుంటారు. కూర, బజ్జీ, పచ్చడి.. ఇలా ప్రతిదానికి ప్రత్యేకమైన రుచి ఉంటుంది. బీరకాయ పోషకాలు అధికంగా ఉండే కూరగాయ. దీని మృదువైన రుచితో పాటు శరీరానికి చల్లదనం, హైడ్రేషన్‌ను అందించే గుణాలు ఉన్నాయి. నీటి శాతం ఎక్కువగా ఉండటం వలన బీరకాయ వేసవికాలంలో ప్రత్యేకంగా శరీరానికి ఉపశమనాన్ని ఇస్తుంది. అలాగే ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
విటమిన్-C, విటమిన్-A, ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజాలు బీరకాయలో పుష్కలంగా ఉన్నాయి. చర్మానికి కొత్త కాంతిని ఇవ్వడంలో కూడా ఇది సహకరిస్తుంది. అయితే సాధారణంగా ఎక్కువ మంది బీరకాయలను ఎక్కువగా తినడానికి ఇష్టపడరు. కానీ అలాంటి వాళ్ల కోసం కూడా మళ్లీ మళ్లీ తినాలి అనిపించేలా చేసే వంటకమే బీరకాయ పచ్చడి. పావుగంటలోనే సులభంగా సిద్ధమయ్యే ఈ పచ్చడి అన్నం, రొట్టె, ఇడ్లీ-దోసెలకు బాగా సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడి తయారీని స్టెప్-బై-స్టెప్‌గా, కొన్ని ప్రత్యేకమైన చిట్కాలతో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు (4-5 మందికి).. బీరకాయలు – 400 గ్రాములు నూనె – 7 టేబుల్ స్పూన్లు ధనియాలు – 1½ టేబుల్ స్పూన్ జీలకర్ర – 2 టీ స్పూన్లు పల్లీలు – 2 టేబుల్ స్పూన్లు వెల్లుల్లి – మొత్తం 13 రెబ్బలు పచ్చిమిర్చి – 15 టమోటాలు – 3 పసుపు – ½ టీ స్పూన్ ఉప్పు – తగినంత చింతపండు – 50 గ్రాములు (కొంచెం నానబెట్టినా బాగుంటుంది) కొత్తిమీర – 100 గ్రాములు తాలింపు కోసం..
ఆవాలు – 1 టీ స్పూన్ మినపప్పు – 1 టీ స్పూన్ శనగపప్పు – ½ టేబుల్ స్పూన్ ఎండుమిర్చి – 2 జీలకర్ర – ½ టీ స్పూన్ కరివేపాకు – 3 రెమ్మలు ఇంగువ – ¼ టీ స్పూన్ తయారీ విధానం.. ముందుగా 400 గ్రాముల బీరకాయలను శుభ్రంగా కడిగి, పొట్టు తీసి ముక్కలుగా కోయాలి. తర్వాత పొయ్యి వెలిగించి, పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించాలి.
అదే పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు, పది వెల్లుల్లి రెబ్బలు వేసి మధ్యస్థ మంటపై వేగించాలి. పల్లీలు వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసి, రంగు మారే వరకు వేయించి స్టవ్ ఆపివేయాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్‌లోకి తీసుకుని కొద్దిగా నీటిని చేర్చి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇదే కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి అయ్యాక, కోసిన బీరకాయ ముక్కలు వేసి కలిపి మూతపెట్టాలి. ఇలా సుమారు పది నిమిషాలు ఉడికించాలి. బీరకాయలు మగ్గిన తర్వాత టమోటా ముక్కలు, అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు చేర్చాలి. టమోటా ముక్కలు మెత్తబడే వరకు వేయించి, చింతపండు కూడా వేసి మూతపెట్టి మగ్గించాలి. తాలింపు కోసం, పొయ్యిపై మరో పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ మినపప్పు, అర టేబుల్ స్పూన్ శనగపప్పు, రెండు ఎండుమిర్చి ముక్కలు వేసి వేయించాలి. పప్పులు రంగు మారగానే ఆరు వెల్లుల్లి రెబ్బలు, అర టీ స్పూన్ జీలకర్ర, మూడు రెమ్మల కరివేపాకు వేసి వేయించాలి. చివరగా పావు టీ స్పూన్ ఇంగువ వేసి బాగా కలపాలి. స్టవ్ ఆపి, సిద్ధంగా ఉంచుకున్న బీరకాయ, పల్లీల మిశ్రమాన్ని ఈ తాలింపులో వేసి కలపాలి. ఇప్పుడు మీకోసం టేస్టీ టేస్టీ బీరకాయ పచ్చడి సిద్ధం. ఈ పచ్చడిని వేడివేడి అన్నంతో, కాస్త నెయ్యి వేసుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.
































