విజయవాడవాసులకు పండగే.. కొత్తగా 100 ఎలక్ట్రికల్ బస్సులు, 11 రూట్‌లలో పరుగులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం సహకారంతో పీఎం ఈ-బస్‌ సేవా పథకం ద్వారా రాష్ట్రానికి ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొస్తోంది. ప్రధాన నగరాలకు ఈ బస్సుల్ని కేటాయించారు.. అయితే విజయవాడకు కూడా భారీగా బస్సుల్ని కేటాయించారు. విజయవాడకు మొత్తం 100 బస్సులు కేటాయించారు.. ఈ బస్సుల నిర్వహణ కోసం విద్యాధరపురం డిపోలో ఏర్పాట్లు చేయనున్నారు. ఈ బస్సులకు సంబంధించిన ఒప్పందం కూడా పూర్తి చేయగా.. మరో ఆరు నెలల్లో బస్సులు విజయవాడలో పరుగులు తీయనున్నాయి. ఈ ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ భారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే.
విజయవాడ నగరంలో మొత్తం 400 బస్సుులు ఉన్నాయి.. అయితే కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులు రానుండటంతో.. పాత బస్సుల్ని పక్కన పెడతారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులతో దాదాపుగా 7వేల లీటర్ల డీజిల్ వరకు ఆదా అవుతుంది.. కాలుష్యం కూడా తగ్గుతుందంటున్నారు. విద్యాధరపురం డిపోలో ఈ బస్సుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు విద్యాధరపురం డిపోను పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సుల కోసం కేటాయిస్తున్నారు.. అక్కడ ఉన్న బస్సుల్ని పొరుగున ఉన్న డిపోలకు తరలిస్తారు.. ఉద్యోగుల్ని కూడా అక్కడికి పంపిస్తారని చెబుతున్నారు.


విద్యాధరపురం డిపోలో అవసరమైన పనులు చేపట్టేందుకు రూ.12.5 కోట్లు కేటాయించారు. ఈ ఎలక్ట్రిక్ బస్సుల కోసం సబ్ స్టేషన్ (6,000 కేవీ), ఛార్జింగ్ స్టేషన్ నిర్మిస్తారు. మొత్తం 20 ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో పాయింట్‌లో ఐదు బస్సుల్ని ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే నిధుల్లో కేంద్రం 60శాతం, రాష్ట్రం 40శాతం సమకూరుస్తాయి. ఈ బస్సుల నిర్వహణ బాధ్యతను పినాకిల్‌ మొబిలిటీ సంస్థకు అప్పగించారు. ఈ బస్సుల్లో విధులు నిర్వహించేందుకు మొత్తం 250 మంది డ్రైవర్లను పినాకిల్ సంస్థ సమకూరుస్తుంది. ఈ బస్సులకు సబంధించి అవసరమైన 250 మంది కండక్టర్లను ఆర్టీసీ సర్దుబాటు చేయనుంది. ఒక్కో బస్సులో 40 సీట్లు ఉంటాయి.. అలాగే ఉచిత బస్సు పథకం స్త్రీశక్తి కూడా వర్తిస్తుంది. విజయవాడకు కేటాయించిన మొత్తం 100 బస్సులు 11 రూట్లలో అందుబాటులోకి రానున్నాయి.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.