2 లక్షలకే ఘనంగా పెళ్లి, 13 రకాల వంటకాలతో 400 మందికి విందు.. ఏసీ ఫంక్షన్‌ హాల్‌

ఇటీవల కాలంలో పెళ్లి అంటే భారీ ఖర్చుతో కూడుకున్న పనైపోయింది. కల్యాణ మండపాలు, డెకరేషన్లు, విందు భోజనాలు, ఫొటోలు, వీడియోలు అంటూ పెళ్లి ఖర్చులు రూ.లక్షల్లో ఉంటున్నాయి. సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు కూడా పెళ్లి వేడుకలకు కనీసం రూ.5లక్షలు కేటాయిస్తున్నారు.


ఇలాంటి పరిస్థితుల్లో వరంగల్‌లోని ఆర్యవైశ్య సంఘం శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం చారిటబుల్‌ ట్రస్టు బంపరాఫర్‌ ప్రకటించింది. కేవలం రూ.2లక్షలు ఇస్తే ఘనంగా పెళ్లి వేడు క నిర్వహిస్తామని ప్రకటించింది. ఏసీ ఫంక్షన్‌ హాల్‌, వేదిక, మండపం, అలంకరణ, స్వాగత తోరణం బ్యానర్‌, బెలూన్స్‌తో పాటు, సౌండ్‌ సిస్టం, ఫొటోలు, వీడియోలు తీసి పెన్‌డ్రైవ్‌లో ఇస్తామని ప్రకటించింది. అంతేనా అర్చుకుడిని ఏర్పాటు చేయడమే కాక 13 రకాల వంటకాలతో 200 నుంచి 400 మంది వరకు విందు భోజనం కూడా ఏర్పాటు చేస్తామని ట్రస్టు నిర్వాహకులు అంచూరి శ్రీనివాస్‌ గుప్తా, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు, మాజీ మేయర్‌ గుండా ప్రకాశ్‌ రావు తెలిపారు.

మంగళవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. ములుగు రోడ్‌లోని వాసవీ మాత దేవాలయంలో ఈనెల 21 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైందని, ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయని తెలిపారు. శాకాహార భోజనంతో పెళ్లి విందు ఏర్పాటు చేసే ఈ వివాహంలో పెళ్లికి వచ్చే బంధు మిత్రులకు ఉదయం టిఫిన్‌, టీ (200 మందికి) ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇక, రిసెప్షన్‌ చేసుకోవాలనే వారికీ ఉదయం వేళ అయితే టిఫిన్‌, రాత్రివేళ అయితే వెజ్‌మంచూరియా, బాదం పాలు అందిస్తామన్నారు.

అలాగే, పుట్టినరోజు వేడుకలు, నూతన వస్త్రాలంకరణ, షష్టి పూర్తి చేసుకునే వారికి రూ.75 వేలకే జరిపిస్తామని, 150 మందికి 13 రకాలతో భోజనం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కులమతాలకతీతంగా అందరికీ ఈ అవకాశం కల్పిస్తున్నామని, కేవలం శాకాహారం మాత్రమే అందిస్తామని ట్రస్టు నిర్వాహకులు స్పష్టం చేశారు. కాగా, ఈ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.