మన ఆరోగ్యానికి ఆకుకూరలు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. కనుకనే వైద్యులు సైతం రోజూ ఒక ఆకుకూరను కచ్చితంగా తినాలని సూచిస్తుంటారు.
ఈ క్రమంలోనే మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఆకుకూరల్లో పొన్నగంటి కూర కూడా ఒకటి. ఈ ఆకుకూరలో మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ ఆకుకూరను తింటే పురుషులకు ఎంతగానో మేలు జరుగుతుందని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. పొన్నగంటి ఆకులో విటమిన్లు బి6, సి, విటమిన్ ఎ తోపాటు రైబో ఫ్లేవిన్, ఫోలేట్, మెగ్నిషియం, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
రోగ నిరోధక శక్తికి..
పొన్నగంటి ఆకులను తింటే శరీర రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. దీంతో శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. అలాగే ఈ ఆకు కూరను తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు యాక్టివ్గా మారుతుంది. బ్రాంకైటిస్, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు ఈ ఆకులను తింటే ఎంతగానో ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా పొన్నగంటి ఆకుల రసంలో తేనె కలిపి తీసుకుంటే ఆయా శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎముకల పెరుగుదలకు కూడా ఈ ఆకుకూర ఎంతగానో దోహదం చేస్తుంది. ఈ ఆకుల్లో ఉండే క్యాల్షియం ఎముకలను బలంగా, ఆరోగ్యంగా మారుస్తుంది. ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు ఉన్నవారు ఈ ఆకులను తింటే ఎంతో మేలు జరుగుతుంది.
పురుషుల లైంగిక శక్తికి..
పొన్నగంటి ఆకులను తింటే శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. అధిక బరువు తగ్గుతారు. ముఖ్యంగా పొట్ట దగ్గరి కొవ్వు కరుగుతుంది. అలాగే కొలెస్ట్రాల్ లెవల్స్ అదుపులోకి వస్తాయి. క్యాన్సర్ కణాలను నాశనం చేసే శక్తి ఈ ఆకులకు ఉంటుంది. పొన్నగంటి ఆకులను తరచూ తింటుంటే పలు రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే ఈ ఆకులను తినడం వల్ల పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. పురుషులకు కావల్సినంత శక్తిని అందించడంలో ఈ ఆకులు ఎంతో పనిచేస్తాయి. పొన్నగంటి కూరను పురుషులు తరచూ తింటుంటే లైంగి సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. అలాగే పురుషుల్లో ఏర్పడే జీవక్రియా లోపాలు కూడా సవరించబడతాయి. దీంతో మెటబాలిజం మెరుగు పడుతుంది. క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు.
బరువు తగ్గేందుకు, పెరిగేందుకు..
పొన్నగంటి ఆకు సన్నగా ఉండే వారిని లావుగా చేస్తుంది. లావుగా ఉండే వారు బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. ఈ ఆకులను నేరుగా తింటే బరువును తగ్గించుకోవచ్చు. అదే నెయ్యి, కందిపప్పుతో కలిపి తింటే బరువు పెరుగుతారు. ఇలా రెండు రకాలుగా ఈ ఆకులు పనిచేస్తాయి. శరీరంలోని కొవ్వును ఈ ఆకులు నియంత్రిస్తాయి. పొన్నగంటి ఆకులను తినడం వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. ఊపిరితిత్తుల్లో ఉండే కఫం కరిగిపోతుంది. కంటి కలకలు, కురుపులతో బాధపడేవారు ఈ ఆకులను బాగా కడిగి కళ్ల మీద పెట్టుకుంటే ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా పొన్నగంటి ఆకులతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు.