పిల్లల పెంపకంలో కొత్త బాట.. రివర్స్‌ పేరెంటింగ్‌!

ఈ తరం అమ్మల పెద్ద సందేహం ఏంటో తెలుసా? పిల్లలను ఎలా పెంచాలనే! ఎలా పెంచినా తప్పులు ఎంచేవారే ఎక్కువ మరి. అందుకే, మిలీనియల్‌ అమ్మలు కొత్త బాటపట్టారు. అదేంటో తెలుసా… ‘రివర్స్‌ పేరెంటింగ్‌’. చైనాలో ప్రాచుర్యం పొంది, ప్రపంచమంతా ఆకర్షిస్తోన్న ఈ పేరెంటింగ్‌ విశేషమేంటంటే… పెద్దవాళ్లు చెబితే పిల్లలు వినాలి… ఒకప్పటి పెంపకమిది. పిల్లల ఇష్టాలకు తగ్గట్టుగా నడుచుకోనివ్వాలి అన్నది కొందరి తీరు. ఈ రెండూ కాకుండా పిల్లల మనస్తత్వాలకు అనుగుణంగా… వాళ్లంతట వాళ్లు నేర్చుకునేలా చేయాలన్నది రివర్స్‌ పేరెంటింగ్‌ ఉద్దేశం. దీనిలోనూ మూడు సిద్ధాంతాలుంటాయి.


1. వాళ్లు మనం – మనం వాళ్లలా

మామూలుగా పిల్లలు ఏదైనా చేయాలంటే ఏం చేస్తాం? గట్టిగా చెబుతాం లేదంటే బతిమాలతాం అవునా? ఇక్కడ రెండింటికీ భిన్నంగా చెబుతారు. ‘అరె ఈ బొమ్మలు, పుస్తకాలు అంతా గజిబిజిగా ఉన్నాయి. చూడటానికి అస్సలు బాలేదు. కానీ వీటన్నింటినీ ఎలా సర్దాలి? నాకస్సలు తెలియట్లేదు. కన్నా నీకు తెలుసా? సాయం చేస్తావా’ అని అడుగుతారు. అప్పుడు పిల్లలు తమకు ప్రాధాన్యమిస్తున్నారు అని భావిస్తారట. బాధ్యతగా దాన్ని పూర్తిచేస్తారు. ఇలా చేయడం ద్వారా పిల్లలకు సహానుభూతి, ఓపికతో ఉండటం, కేరింగ్‌ వంటివి నేర్పుతారన్నమాట.

2. అనుభవంతో నేర్చుకోవడం

ఒక ఎనిమిదేళ్ల పిల్లాడు తల్లి దగ్గరికి వచ్చి అమ్మా నేనిక చదువుకోను. గేమర్‌ అవుతాను అన్నాడట. మామూలుగా ఇలా చెప్పినప్పుడు ఏం చేస్తాం? నోరు మూసుకుని పుస్తకం పట్టుకో అనో, ఇంకోసారి ఆన్‌లైన్‌ ఆటల జోలికి వెళితే ఊరుకోను అనో చెబుతాం అవునా? ఇక్కడేం చేస్తారో తెలుసా? సరే నాన్నా… గేమర్‌ జీవితం ఎలా ఉంటుందో కొన్నిరోజులు జీవించి చూడు. అప్పటికీ నచ్చితే అదే చేద్దువుకానీ అన్నారట. వాళ్ల షెడ్యూల్‌ అంతా ప్లాన్‌ చేసి ఇచ్చారట. ఏకధాటిగా 16 గంటలు ఆడుతూ రికార్డులు నోట్‌ చేసుకుంటూ వెళ్లాడట ఆ అబ్బాయి. కొన్నిరోజులకే అలసిపోవడం, కళ్ల నొప్పులు బాధించాయి. అప్పుడా అబ్బాయి గేమింగ్‌ ఫన్‌ కాదు… చాలా కష్టపడాలి, ఒత్తిడితో కూడుకున్నది అని అర్థం చేసుకున్నాడు. నేను స్కూల్‌కే వెళతానని చెప్పాడు. ఇక్కడ అది కష్టం, ఈ వయసులో నీవల్ల కాదు అని మాటల్లోనూ చెప్పొచ్చు. కానీ పిల్లలు అమ్మానాన్నలు మాకు నచ్చింది ఏదీ చేయనీయరు అన్న కోపం, బాధనే పెంచుకుంటారు. అదే అనుభవంలోకి వస్తే ఏది మంచీ ఏది చెడూ అన్నది స్వయంగా నేర్చుకుంటారు అంటున్నారు.

3. వాళ్లని అనుకరించడం

ఐస్‌క్రీమ్‌ లేదా బొమ్మ కావాలని అడుగుతాడు పిల్లాడు. తల్లిదండ్రులు ససేమిరా అంటారు. ఇంకేం నేలమీద పడి ఏడుస్తుంటాడు. తల్లీ వెంటనే కిందపడి పిల్లాడిలాగే గోల చేయడం మొదలుపెడుతుంది. కంగుతిన్న పిల్లాడు ఏడుపు ఆపి అమ్మ వంక ఆశ్చర్యంగా చూస్తాడు… సోషల్‌మీడియాలో ఇలాంటి వీడియోలు ఈ మధ్య చాలానే చూశాం కదూ! ఇవి వీక్షణల కోసం చేసినవే కాదు… దీన్నీ రివర్స్‌ పేరెంటింగ్‌లో భాగంగా పాటిస్తున్నారు. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే… పిల్లలు వాళ్ల ప్రవర్తనని వాళ్లు అర్థం చేసుకుంటారు. అలా చేయడం ఎంత తప్పో తెలుసుకుంటారు.

కఠినంగా ప్రవర్తించడం, ఆంక్షలు విధించడం వల్ల పిల్లల్లో భయం ఏర్పడుతుందే తప్ప అర్థం చేసుకోవడం రాదు. ఈ విధానంలో అనుభవం, ప్రోత్సహించడం, బాధ్యత నేర్పడం ద్వారా త్వరగా తెలుసుకుంటారు అంటున్నారు. అయితే ఇదీ మరీ ఎక్కువగా ప్రయత్నించొద్దు. అప్పుడప్పుడు అర్థమయ్యే రీతిలో చెబుతూ పాటించాలి. అలాగే ఇది పదేళ్లలోపు వాళ్లకే! మరీ పెద్ద పిల్లల విషయంలో పనికి రాదు. గమనించుకుని ప్రయత్నించండి మరి!