మ్యాట్రిమోనీతో వలపు వల.. ఇల్లు, రూ.30 లక్షలు కోల్పోయిన పెళ్లికాని ప్రసాద్

మ్యాట్రిమోనీలో పరిచయమైన యువతి మాయలో పడి ఓ యువకుడు రూ.30 లక్షల నగదుతోపాటు కొత్త ఇంటిని పోగొట్టుకున్న ఘటన భూపాలపల్లి జిల్లాలో జరిగింది.
ఆన్‌లైన్ ప్రేమలు, హనీట్రాప్‌లు, మ్యాట్రిమోనీ పేరుతో రోజుకో కొత్త తరహా మోసం వెలుగులోకి వస్తుంది. ఇలాంటి నేరాలపై పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నా.. అమ్మాయి కనిపించగానే యువకులు బెండైపోతూ అడ్డంగా బుక్కవుతున్నారు. అమ్మాయిలు అడిగిందల్లా ఇచ్చేస్తూ.. చూపిస్తూ.. సర్వం కోల్పోయాక మోసపోయాం న్యాయం చేయండి అంటూ పోలీస్ స్టేషన్‌ మెట్లెక్కుతున్నారు. ఇలాంటి సంఘటనలు కేవలం నగరాలు, పట్టణాలకే పరిమితం కావడం లేదు.. గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది. మోడ్రెన్ డ్రస్సుల్లో అందమైన అమ్మాయి కనిపించగానే.. దొరికిందే ఛాన్స్ అంటూ పల్లెటూరు వ్యక్తులు కూడా బలి అవుతున్నారు. తాజాగా వర్ధన్న పేటకు చెందిన యువకుడు తెలుగు మ్యాట్రిమోనీ యాప్‌లో పరిచయమైన యువతి చేతిలో నిండామోసపోయాడు. రూ.30 లక్షలతోపాటు ఇంటిని పోగొట్టుకున్నాడు. పైగా అతడిపైనే కేసు పెట్టి జారుకుంది ఆ యువతి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..


మనం ఇల్లుకొని పెళ్లి చేసుకుందామా..?
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రానికి చెందిన చిద్దురాల సత్యనారాయణ బైక్ మెకానిక్ పని చేస్తూ తల్లిదండ్రులతో జీవిస్తున్నాడు. ఆయన వయసు పెరుగుతున్నా పెళ్లికాకపోవడంతో తెలుగు మ్యాట్రిమోనీ యాప్‌లో తన వివరాలు పెట్టాడు. దీంతో ఆ యాప్‌ ద్వారా భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో రెండేళ్లు ఛాటింగ్ చేసుకున్న తర్వాత ‘నేను నిన్ను ప్రేమిస్తున్నా’నని యువతి ప్రపోజ్ చేసింది. ‘ఇద్దరం పెళ్లి చేసుకుందాం’ అని నమ్మింది. పెళ్లికి ముందే మనకంటూ ఓ సొంత ఇల్లు ఉండాలని, భూపాలపల్లిలో ఇళ్లు కొందామని సత్యనారాయణ నుంచి రూ.30 లక్షల వరకు తీసుకుంది. ఆ డబ్బులతో పట్టణంలోని రామ్‌నగర్‌లో ఓ పురాతన ఇంటిని తీసుకోని మరికొన్ని డబ్బులు తీసుకుని రిపేర్ చేయించింది. ఆ ఇంటికి సత్యనారాయణకు తెలియకుండా ఆమె పేరుపై రిజిస్ట్రేషన్‌ చేయించుకుంది. కొద్ది రోజులు సత్యనారాయణతో కలిసి ఉంది.

ఛల్ దొబ్బేయ్.. అసలు నువ్వెవరు?
ఈ తర్వాత నుంచి అతడిని దూరం పెడుతూ.. అసలు నువ్వెవరో తెలియదు అంటూ వెళ్లగొట్టింది. దీంతో షాక్ తిన్న సత్యానారాయణ సదరు యువతి గురించి ఎంక్వైరీ చేయగా షాకింగ్ విషయాలు తెలిశాయి. అప్పటికే ఆమెకు పెళ్లై ఓ కూతురు ఉందని, తను కొనుగోలు చేసిన ఇంటిని సైతం ఆమె పేరుపైనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు ఆలస్యంగా తెలిసింది. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతోపాటు తన డబ్బులతో ఇంటిని కొనుగోలు చేసి, ఇప్పుడు తనెవరో తెలియదంటూ బుకాయిస్తున్న యువతిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వర్ధన్నపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

పెళ్లై ఓ కూతురు కూడా..
యువతి భూపాలపల్లికి చెందినది కావడంతో వర్ధన్నపేట పోలీసులు భూపాలపల్లికి పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. దీంతో బాధితుడు సత్యనారాయణకు మరో షాక్ తగిలింది. సత్యనారాయణ అనే వ్యక్తి తనను మోసం చేసినట్టు సదరు యువతి భూపాలపల్లికి పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేసిందని అక్కడి పోలీసులు వర్ధన్నపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారంతో ఖంగుతిన్న సత్యనారాయణ భూపాలపల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చి జరిగిన విషయం మొత్తం ఎస్ఐకి వివరించాడు. దీంతో ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఇరుపక్షాలను విచారించి న్యాయం చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు రాష్ట్రంలో సంచలనంగా మారింది. తనకు పెళ్లై కూతురు ఉన్నా, మ్యాట్రిమోనీ ద్వారా పెళ్లికాలేదని అబద్దం చెప్పి మరొకరిని మోసం చేసిన యువతిపై స్థానికులు ఫైర్ అవుతున్నారు. కాగా, సదరు యువతి ఆశవర్కర్‌గా పని చేస్తున్నట్లు సమాచారం.