చెట్టినాడ్ చికెన్ అనేది దాని అద్భుతమైన రుచి, ఘాటైన మసాలా సువాసనతో దేశవ్యాప్తంగా పేరు పొందింది. ఈ వంటకం తమిళనాడు సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన చికెన్ వంటకాలలో ఒకటిగా దీనిని పరిగణిస్తారు. మీరు స్పైసీ ఫుడ్‌ను ఇష్టపడితే, చెట్టినాడ్ చికెన్ మీకు ఒక అద్భుతమైన ఎంపిక. మరి ఈజీగా చేసే ఈ రెసిపీ గురించి తెలుసుకుందాం..
తమిళనాడులోని చెట్టినాడ్ ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా దాని ప్రత్యేకమైన మసాలా వంటకాలకు ప్రసిద్ధి చెందింది. వాటిలో చెట్టినాడ్ చికెన్ చాలా ప్రాచుర్యం పొందింది. ఇది ఘాటైన రుచి, సువాసనతో ఆహార ప్రియులను ఆకట్టుకుంటుంది. ఈ వంటకం ముఖ్యంగా మిరియాలు, సోంపు, గసగసాలతో సహా అనేక సుగంధ ద్రవ్యాలను ఉపయోగిస్తుంది. ఈ మసాలాలను వేయించి, పేస్ట్ చేసి వంటలో వాడతారు. ఇది గ్రేవీకి ఒక ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది.
కావాల్సిన పదార్థాలు:
చికెన్: 1 కిలో (మీడియం ముక్కలుగా కట్ చేసినవి)
ఉల్లిపాయలు: 2 పెద్దవి (సన్నగా తరిగినవి)
టమాటాలు: 2 మధ్యస్థవి (ముక్కలుగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 టేబుల్ స్పూన్లు
పసుపు: 1/2 టీస్పూన్
నూనె: 4 టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి సరిపడా
కరివేపాకు: కొద్దిగా
చెట్టినాడ్ మసాలా కోసం:
ఎండు మిర్చి: 6-8
ధనియాలు: 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర: 1 టీస్పూన్
సోంపు: 1 టీస్పూన్
మిరియాలు: 1 టీస్పూన్
యాలకులు: 3
లవంగాలు: 4
దాల్చిన చెక్క: చిన్న ముక్క
గసగసాలు: 1 టీస్పూన్
కొబ్బరి తురుము: 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం:
మసాలా సిద్ధం చేయడం: ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో మసాలా దినుసులన్నీ (కొబ్బరి తురుము, గసగసాలు మినహా) వేసి తక్కువ మంట మీద సువాసన వచ్చేంత వరకు వేయించాలి.
వేగిన తర్వాత, ఆఖరిలో కొబ్బరి తురుము, గసగసాలు వేసి ఒక నిమిషం పాటు వేయించి స్టవ్ ఆపివేయాలి.
ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లార్చి, తగినంత నీరు వేసి మెత్తని పేస్ట్‌లాగా గ్రైండ్ చేసుకోవాలి.
చికెన్ వండటం: ఇప్పుడు ఒక పెద్ద పాన్ లేదా కడాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి.
తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగించాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక, తరిగిన టమాటా ముక్కలు, పసుపు వేసి, టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి.
ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్, ఉప్పు వేసి నూనె పైకి తేలేంత వరకు బాగా వేయించాలి.
మసాలా వేగిన తర్వాత, చికెన్ ముక్కలు వేసి బాగా కలిపి, సుమారు 5-7 నిమిషాలు ఉడికించాలి.
అందులో ఒక గ్లాసు నీళ్లు పోసి, మూత పెట్టి చికెన్ పూర్తిగా ఉడికేంత వరకు మీడియం మంట మీద ఉడికించాలి.
గ్రేవీ చిక్కబడిన తర్వాత, స్టవ్ ఆపివేసి వేడిగా సర్వ్ చేయాలి. దీనిని అన్నం, చపాతీ, పరోటా లేదా పులావ్‌తో తింటే చాలా రుచిగా ఉంటుంది.
































