అమెరికాకు రక్షణ కవచాల కొరత!

‘‘మేం ఆయుధాల కొరతను ఎదుర్కోవడం లేదు. ఎప్పుడూ లేనంతగా మా దగ్గర నిల్వలు ఉన్నాయి’’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగం చెబుతున్నా.. రక్షణ నిపుణులు మాత్రం ఇందుకు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇరాన్‌తో యుద్ధం మూడు నుంచి నాలుగు వారాలు దాటి కొనసాగితే ఆయుధాల కొరత ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత యుద్ధంలో ఇరాన్‌ చౌకగా తయారు చేసిన డ్రోన్లను భారీ సంఖ్యలో వినియోగిస్తోంది. ఒక్కో డ్రోన్‌ ధర కేవలం 20 వేల నుంచి 50 వేల డాలర్లలోపే. అయితే వీటిని ఎదుర్కోవడానికి అమెరికా వినియోగిస్తున్న ఒకొక్క ఇంటర్‌సెప్టర్‌ క్షిపణి ధర మాత్రం 1.5 మిలియన్‌ డాలర్ల పైమాటే. ఆర్థికపరమైన ఈ అంతరం యుద్ధంలో అమెరికాపై ప్రభావం చూపనుందని నిపుణులు అంటున్నారు. పోరు మొదలైన 100 గంటల్లోనే 2 వేలకు పైగా స్మార్ట్‌ బాంబులను అగ్రరాజ్యం ప్రయోగించింది. వీటి ఖరీదే.. 3.7 బిలియన్‌ డాలర్లు. అంతేకాదు.. వందల సంఖ్యలో ఇరాన్‌ ప్రయోగిస్తున్న క్షిపణులను అడ్డుకోవడానికి అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఇంటర్‌సెప్టర్లను అగ్రరాజ్యం వినియోగించాల్సి వస్తోంది. అత్యంత ఖరీదైన గగనతల రక్షణ వ్యవస్థలతో(పేట్రియాటిక్, థాడ్‌) ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో వీటి నిల్వలు భారీగా తరిగిపోతున్నాయని వార్తలొస్తున్నాయి.


రాడార్‌ వ్యవస్థలే లక్ష్యం
అమెరికా క్షిపణులను, వైమానిక దాడులను అడ్డుకోవడం కష్టమని ఇరాన్‌కు తెలుసు. అందుకే గగనతలంలో అగ్రరాజ్యానికి కళ్లు, చెవులుగా పనిచేసే రాడార్‌ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుంది. సౌదీ అరేబియా, జోర్డాన్, బహ్రెయిన్, కువైట్, ఖతార్, యూఏఈల్లో ఈ వ్యవస్థలు ఉన్నాయి. వీటిపై గురిపెట్టి.. ఇరాన్‌ డ్రోన్‌ దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో జోర్డాన్‌లో అమెరికా స్థావరంలోని దాదాపు 300 మిలియన్‌ డాలర్ల విలువైన థాడ్‌ రక్షణ వ్యవస్థ ధ్వంసమైంది. ఈ రాడార్‌ లేకపోతే క్షిపణులు ఎక్కడ నుంచి వస్తున్నాయో గుర్తించడం, అడ్డుకోవడం కష్టమవుతుంది. కువైట్‌లోనూ మూడు రాడార్‌ వ్యవస్థలకు ఇరాన్‌ డ్రోన్లు నష్టం కలిగించాయి. సౌదీ అరేబియాలోని అమెరికా స్థావరమైన ప్రిన్స్‌ సుల్తాన్‌ ఎయిర్‌బేస్‌లో కీలక రాడార్‌ వ్యవస్థను ఈ డ్రోన్లు దెబ్బతీశాయి.ఆయుధ నిల్వల విషయంలో అమెరికా అప్రమత్తంగా ఉండాలని సెంటర్‌ ఫర్‌ స్ట్రాటజిక్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ (సీఎస్‌ఐఎస్‌) ఇటీవల అమెరికాను హెచ్చరించింది. ఆ నివేదిక ఏం చెప్పిందంటే..

2025 డిసెంబరు నాటికి అమెరికా దగ్గర థాడ్‌ క్షిపణులు 534, ఎస్‌-3లు 414 ఉన్నాయి.
గతేడాది ఇరాన్‌పై జరిగిన 12 రోజుల యుద్ధంలో థాడ్‌ నిల్వల్లో అమెరికా 20 నుంచి 50 శాతం ఖర్చు చేసేసింది.
ఇంటర్‌సెప్టర్‌ క్షిపణుల తయారీకి ఎక్కువ సమయం పడుతుంది. ఏడాదికి 700 క్షిపణులు తయారు చేసే సామర్థ్యం అమెరికా సంస్థలకు ఉంది.
సాధారణ మందుగుండు సామగ్రి విషయంలో కొరత లేకపోయినా.. థాడ్, పేట్రియాట్, సీఎం-3 లాంటి అత్యాధునిక ఆయుధ వ్యవస్థల విషయంలో అమెరికా ఇబ్బందులు ఎదుర్కోనుంది.