భారతదేశ ఆహ్వానంపై ఇటీవల అతిథిగా వచ్చివెళ్తున్న ఇరాన్ యుద్ధనౌకను ఓ అమెరికా జలాంతర్గామి మార్గమధ్యంలోనే టార్పెడోతో పేల్చి ముంచేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ దాడి వల్ల ఇరాన్ నౌకలో కనీసం 80మందికి పైగా నావికులు మరణించారు. ఈ పరిణామం మానవతా కోణం నుంచి అమెరికా వ్యూహాలు, అంతర్జాతీయ చట్టాల వరకు అనేక కీలక ప్రశ్నలను లేవనెత్తుతోంది. అన్నింటినీ మించి ఇది ఇండియాకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని తెచ్చిపెట్టింది.
విశాఖపట్నం సాగర తీరంలో గత నెలలో జరిగిన అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాల్లో ఇరాన్ యుద్ధనౌక ‘దేనా’ సహా సుమారు 70 దేశాల నౌకా దళాలు పాల్గొన్నాయి. విన్యాసాల అనంతరం ‘దేనా’ స్వదేశానికి తిరిగి బయల్దేరింది. అయితే, శ్రీలంక రేవు గాలే సమీపంలోని అంతర్జాతీయ జలాల్లో మాటువేసిన షార్లెట్ అనే అమెరికా అణు జలాంతర్గామి మార్చి 4న టార్పెడోను ప్రయోగించి ‘దేనా’ను ముంచేసింది. ‘స్నేహ వారధులు’ అనే సందేశంతో భారత్ ఆహ్వానించగా వచ్చిన ఇరాన్ నౌకను అమెరికా ఇలా ముంచేయడం దిల్లీకి సంక్లిష్ట సందేశాలు పంపుతోంది. రెండో ప్రపంచ యుద్ధం తరవాత ఒక అమెరికన్ జలాంతర్గామి శత్రుదేశ యుద్ధనౌకను టార్పెడోతో ముంచేయడం ఇదే మొదటిసారి.
భారత్ గ్రహించాల్సిందేంటి?
హిందూ మహాసముద్రం ఇకపై ప్రధాన దేశాల యుద్ధాలకు దూరంగా ఉండే శాంతి మండలం కాదని అమెరికా పంపిన సందేశంగా ‘దేనా’పై దాడిని చూడాలి. పశ్చిమాసియాలో జరుగుతున్న ప్రస్తుత యుద్ధం హర్మూజ్ జలసంధి, అరేబియా సముద్రాలను దాటి హిందూ మహాసముద్రానికి పాకింది. టెహ్రాన్ నౌకాదళ సామర్థ్యాన్ని దెబ్బతీయాలనే అగ్రరాజ్య పట్టుదల ఇరాన్ సాగర సరిహద్దులను దాటి సుదూర జలాలకు విస్తరించింది. ఇది ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు అంతకంతకు తీవ్రతరమవుతున్నట్లు విస్పష్టం చేస్తోంది. వాస్తవానికి, విశాఖ తీరంలో జరిగిన అంతర్జాతీయ నౌకదళ విన్యాసాల్లో ‘దేనా’తోపాటు అమెరికాకు చెందిన సాగర నిఘా విమానం కూడా పాల్గొంది. భారత్ ఒక తటస్థ దేశంగా వైరి దేశాలనూ విన్యాసాలకు ఆహ్వానించింది. కానీ, అమెరికా తటస్థంగా వ్యవహరించడానికి సిద్ధంగా లేదని ‘దేనా’పై దాడి తేల్చిచెబుతోంది. మహాసాగరాలు పోరాట సీమలుగా మారుతున్నందున, భారత్ జాగ్రత్తగా అడుగులు వేయక తప్పదు.
ప్రస్తుతం నడుస్తున్నది బహుళ ధ్రువ ప్రపంచమని భావిస్తున్న భారత్- అన్ని దేశాలనూ కలుపుకొని పోవాలని చూస్తోంది. ఇలాంటి తరుణంలో ఇండియాకు అతిథిగా వచ్చిన తమ నౌకను అమెరికా పేల్చేయడమేంటని ఇరాన్ నిగ్గదీయడం దౌత్యపరంగా భారత్‌కు ఇబ్బంది కలిగించింది. అమెరికా ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాలతో సన్నిహితంగా ఉండటం వల్ల భవిష్యత్తులో ఇలాంటి చిక్కులు తప్పకపోవచ్చని ఈ ఘటన హెచ్చరిస్తోంది. యుద్ధ సమయంలో శత్రుదేశాల యుద్ధనౌకలు రేవులో ఉన్నా, సముద్రంలో ఉన్నా తమ దాడులకు గురికాక తప్పదని వాషింగ్టన్ వాదిస్తోంది. నిజానికి తన అతిథిగా వచ్చిన ఇతర దేశపు నౌక అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించిన తరవాత, ఇక దాని భద్రత విషయంలో ఇండియాకు ఎలాంటి బాధ్యతా ఉండదు!
మానవతా దృక్పథంతోనే ఆశ్రయం…
సముద్రంలో ఆపదలో చిక్కుకున్న నౌకలకు సాయం అందించడం, ప్రమాదానికి గురైన నౌకల సిబ్బంది కోసం గాలింపు చర్యలు చేపట్టడం వంటివి మానవతా చర్యల కిందికి వస్తాయి. వీటిని అంతర్జాతీయ సాగర చట్టాలు కూడా ప్రోత్సహిస్తున్నాయి. తదనుగుణంగానే ఇరాన్ నౌకలను ఆదుకుంటున్నామని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ పార్లమెంటులో వివరించారు. ఫిబ్రవరి 28న తమ మూడు నౌకలకు భారత నౌకాశ్రయాల్లో లంగరు వేయడానికి అనుమతించాలని ఇరాన్ కోరినట్లు ఆయన తెలిపారు. ఆ మరుసటి రోజే ఇరాన్ విన్నపాన్ని భారత్ అంగీకరించింది. ‘దేనా’ను అమెరికా ముంచేసిన మార్చి నాలుగో తేదీనే మరో ఇరాన్ నౌక ‘లావన్’ 183 మంది సిబ్బందితో కొచ్చి రేవుకు చేరుకుంది. వారికి భారత నౌకాదళ వసతుల్లో ఆశ్రయం కల్పించారు. ఈ సహాయానికి ఇరాన్ విదేశాంగ మంత్రి భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్ నౌకల్లో సాంకేతిక సమస్యలు తలెత్తినందున ఆశ్రయం కోరారనీ… భారత్ దీన్ని రాజకీయ కోణంలో కాకుండా కేవలం మానవీయ కోణంలోనే చూసిందని జైశంకర్ స్పష్టం చేశారు. అదీకాకుండా ప్రస్తుత యుద్ధం వల్ల సముద్ర మార్గంలో చమురు, గ్యాస్ రవాణాకు చిక్కులు ఎదురవుతున్నాయి. భారత్ తన ఇంధన భద్రత కోసం జాగ్రత్తపడాల్సి ఉంది. హిందూ మహాసముద్రంలో ఆపదకు గురైన నౌకలకు తాను ఆశ్రయం ఇస్తాననే భరోసా భారత్ కల్పించదలచింది. ఇరాన్ నౌకలకు ఆశ్రయం కల్పించడం ద్వారా అమెరికాకు ఆ సందేశాన్నే పంపింది.
ఇప్పుడు చేయాల్సిందేంటి?
ప్రస్తుతం భారత్‌లో ‘లావాన్’, శ్రీలంకలో ‘బుషెహర్’ అనే ఇరాన్ నౌకలున్నాయి. ‘దేనా’ నౌక నుంచి ప్రాణాలతో బయటపడిన వారిని, ఇతర సిబ్బందిని తక్షణమే ఇరాన్‌కు పంపవద్దని అమెరికా శ్రీలంకను కోరుతోంది. ఈ నావికులను ఇరాన్ ప్రచారం కోసం ఉపయోగించుకోకుండా చూడాలన్నది అమెరికా ఉద్దేశం. ఏదిఏమైనా అంతర్జాతీయ చట్టాల(హేగ్ ఒప్పందం) ప్రకారం, యుద్ధంలో ఉన్న దేశాల సిబ్బందిని తిరిగి పంపకుండా పోరు ముగిసే వరకు తమ దగ్గరే ఉంచాల్సిన బాధ్యత శ్రీలంక, భారత్‌లపై ఉంది.
భారతదేశ పెరటిలోకి యుద్ధం విస్తరించడం వల్ల ఇంధన భద్రత, సముద్ర వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీనివల్ల ద్రవ్యోల్బణం పెరిగి సరఫరా గొలుసు దెబ్బతినే ప్రమాదముంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇతర దేశాల హితవును, సలహాలను వినే అవకాశం తక్కువ. అయినాసరే, భారత్ ఈ యుద్ధం వల్ల కలిగే నష్టాలను ఎత్తిచూపడం అవసరం. పీపా చమురు ధర వంద డాలర్లు దాటిపోయే పరిస్థితి వచ్చినా తట్టుకోవడానికి భారత్ సిద్ధంగా ఉండాలి. యుద్ధంలో ఉన్న అన్ని పక్షాలు సంఘర్షణ విరమించాలని ఇండియా పిలుపివ్వాలి. ఆయుధాలు మూగబోతేనే చర్చలకు ఆస్కారం ఉంటుంది.

































