రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం ఒక భారతీయుడి నుంచి అప్పు తీసుకుంది. 109 ఏళ్లుగా ఆ అప్పు అలాగే ఉండిపోయింది. దీంతో ఆ వ్యక్తి మనవడు తమ అప్పును తిరిగి చెల్లించమని కోరుతూ ఏకంగా బ్రిటీష్ ప్రభుత్వానికి నోటీసును పంపుతున్నాడు.
ఇంతకీ ఓ వ్యక్తి నుంచి బ్రిటీషర్లు ఎందుకు అప్పు తీసుకున్నారు? ఆ అప్పును ఇప్పటిదాకా ఎందుకు కట్టలేదు..? (Century old loan case)
మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌కు 38 కి.మీ. దూరంలో చారిత్రక సెహోర్ జిల్లా కేంద్రం ఉంది. బ్రిటీష్ వాళ్లు మన దేశాన్ని పాలించే సమయానికి సెహోర్‌లోని అత్యంత సంపన్నుల్లో సేఠ్ జుమ్మా లాల్ ఒకరు. అప్పట్లోనే ఆయనకు రోల్స్‌రాయ్స్ కారు ఉండేది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్, ఇండోర్, రాజ్‌గఢ్ ప్రాంతాల్లోనూ సేఠ్ జుమ్మా లాల్‌కు మంచి పేరు ఉండేది. పేదలకు చేయూతనివ్వడం, రోగులకు వైద్యసేవలు చేయడం లాంటి సామాజిక సేవా కార్యక్రమాలనూ ఆయన చేశారు. అంతేకాదు సమాజహిత కార్యక్రమాల కోసం బ్రిటీషర్లకు కూడా ఆయన విరాళాలను అందజేశారు.
బ్రిటీష్ పాలకులు, ఉన్నతాధికారులు కూడా సేఠ్ జుమ్మా లాల్‌ను అమితంగా గౌరవించేవారు. నిధుల కొరత ఏర్పడినప్పుడు సేఠ్ జుమ్మా లాల్ దగ్గర బ్రిటీషర్లు అప్పు తీసుకునేవారు. అలా మొదటి ప్రపంచయుద్ధ సమయమైన 1917లో సేఠ్ జమ్మూ లాల్ నుంచి రూ.35వేలు అప్పుగా తీసుకున్నారు. ఆ అప్పునకు సంబంధించి ఒక బాండ్‌ను నాటి బ్రిటీష్ పాలకులు రాసిచ్చారు. ఆ అప్పు ఇచ్చిన 20 ఏళ్ల తర్వాత అంటే 1937లో సేఠ్ జుమ్మా లాల్ మరణించారు. ఆ తర్వాత ఆ బాండ్ ఆయన కొడుకు మనక్ చంద్ర రూథియా చేతికి వచ్చింది. ఆయన 2013లో మరణించారు (British era debt claim).
మనక్ చంద్ర మరణం తర్వాత ఆ బాండ్ ఆయన కొడుకు వివేక్ రూథియా చేతికొచ్చింది. ఆ బాండ్ గురించి ఆయన పూర్తి వివరాలు తెలుసుకున్నారు. సైనిక అవసరాల కోసం ఈ లోన్‌ను తీసుకుంటున్నామనే విషయాన్ని బాండ్‌పై బ్రిటీష్ పాలకులు పేర్కొన్నారు. ఆ బాండ్ ఆధారంగా వివేక్ బ్రిటన్ ప్రభుత్వానికి నోటీసు పంపబోతున్నారు. సేఠ్ జుమ్మా లాల్ వారసుడినైన తనకు అప్పును తిరిగి చెల్లించాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరుతానని చెప్పారు (Rs.35000 loan from Indian).

డబ్బు మీద ఆశతో ఈ పనిచేయడం లేదని, భారతదేశ చారిత్రక అంశాల్లో ఇలాంటి సమాచారం కూడా నమోదు కావాలనే ఆశయంతోనే నోటీసును పంపేందుకు సిద్ధమవుతున్నానని వివేక్ అన్నారు (Historical money case). 1917 నాటి ఒక రూపాయి విలువ, ఇప్పటి 400 రూపాయలకు సమానమని, ఈ లెక్కన ఆనాడు ఇచ్చిన రూ.35వేలు.. ఇప్పటి రూ.2 కోట్లకు సమానమని, వడ్డీని కలుపుకుంటే ఆ విలువ మరింత పెరుగుతుందని వివేక్ అన్నారు. కాగా, ఈ నోటీస్‌ను బ్రిటన్ ప్రభుత్వానికి పంపే హక్కు ఆ కుటుంబానికి ఉందని న్యాయవాది ధీరజ్ కుమార్ తెలిపారు.


































