రాష్ట్ర రాజకీయాల్లో మరో సెన్సేషన్.. కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు

తెలంగాణ రాజకీయాల్లో మరో పార్టీ పురుడు పోసుకోబోతోంది. గత కొంతకాలంగా బీఆర్ఎస్ (BRS) పార్టీకి దూరంగా ఉంటూ, సొంత బాటను ఎంచుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తన నూతన రాజకీయ ప్రస్థానానికి ముహూర్తం ఖరారు చేశారు.
ఇవాళ జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మే మొదటి వారంలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు. కొత్త పార్టీ పేరుపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో కవిత కీలక క్లారిటీ ఇచ్చారు. తమ పార్టీ పేరులో ఖచ్చితంగా ‘తెలంగాణ’ (Telangana) అనే పదం ఖచ్చితంగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని.. తన ఫస్ట్ ఛాయిస్ సిద్దిపేట, సెకండ్ ఛాయిస్ బోధన్‌ అని కవిత స్పష్టం చేశారు. రాష్ట్ర అస్తిత్వాన్ని, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఈ పేరు ఉంటుందని సమాచారం.


కాగా, గత కొన్ని నెలలుగా ‘జనం బాట’ (Janam Bata) పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న కవిత, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) కూడా ఆమె మద్దతుదారులను ఏఐబీఎఫ్ పార్టీ బీ-ఫామ్‌పై పోటీ చేయించి తమ ఉనికిని చాటుకున్నారు. ఈ క్రమంలోనే అధికారికంగా పార్టీని స్థాపించి, 2029 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కల్వకుంట్ల కవిత ఎన్నికల క్షేత్రంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.