అమెరికా అధ్యక్షుడు Donald Trumpకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అక్రమ వలసదారులను ఇతర దేశాలకు తరలించే నిర్ణయాన్ని అక్కడి ఫెడరల్ కోర్టు తప్పుబట్టింది. ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ Massachusettsలోని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి Brian Murphy కీలక తీర్పు వెలువరించారు.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ట్రంప్ అక్రమ వలసదారులపై కఠిన వైఖరి అవలంబిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి Guatemala, South Sudan, Costa Rica వంటి దేశాలకు వలసదారులను తరలించారు.
దీనిపై ప్రభావిత వలసదారులు కోర్టును ఆశ్రయించగా, ఇటీవల విచారణ జరిగింది. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, తగిన గడువు కల్పించకుండా సంబంధం లేని దేశాలకు తరలించడం చట్టవిరుద్ధమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ తీర్పును సవాలు చేయాలనుకుంటే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు ట్రంప్ ప్రభుత్వానికి 15 రోజుల గడువు కూడా ఇచ్చింది.

































