AP Govt : ఏపీలోని నిరుద్యోగులకు ఎగిరిగంతేసే న్యూస్.. మరో డీఎస్సీకి సిద్ధమైన సర్కార్.. ఈసారి ఎన్ని పోస్టులంటే?

AP Govt : ఏపీలోని నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది.
ప్రతీయేటా డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పినట్లుగానే ఈ ఏడాది కూడా డీఎస్సీ నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఉగాది పండుగ సందర్భంగా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకోసం కొత్త డీఎస్సీని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.


ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే క్షేత్ర స్థాయి నుంచి ఖాళీల వివరాలను సేకరించింది. మొత్తం 3,600 వరకు పోస్టులు ఉండొచ్చని తెలుస్తోంది. దీంతో ఈ పోస్టులకు మార్చిలో అంటే ఉగాది పండుగ సమయంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుందని ప్రభుత్వ వర్గాల సమాచారం.

ప్రతీయేటా డీఎస్సీ నిర్వహిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ హామీ మేరకు ఈ ఏడాది కూడా డీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు మొదలు పెట్టింది. గతేడాది ఏప్రిల్ నెలలో మొత్తం 16,347 పోస్టులకు డీఎస్సీ ప్రకటించగా.. వీటిలో 15,941 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. కొన్ని పోస్టులకు రిజర్వేషన్ల అభ్యర్థులు లేకపోవడంతో నిలిచిపోయాయి.

అయితే, ఈ ఏడాదికి సంబంధించిన డీఎస్సీని వచ్చే నెలలోనే ఉగాది పండుగ సందర్భంగా ప్రకటించాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ఈ ఏడాది డీఎస్సీకి కూడా గత ఏడాది డీఎస్సీ మాదిరిగానే సిలబస్, మార్గదర్శకాలనే అమలు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే వెబ్‌సైట్‌లో ప్రత్యేక డీఎస్సీ సిలబస్‌ను అధికారులు అందుబాటులో ఉంచారు.

ఈ ఏడాది నిర్వహించే డీఎస్సీలో భాగంగా పోస్టుల భర్తీ నిమిత్తం.. రాష్ట్ర సంక్షేమ శాఖలకు సంబంధించిన స్కూల్స్, ఆదర్శ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్ల నుంచి అధికారులు సమాచారం తీసుకున్నారు. వీటిల్లో 1200 ఖాళీలు ఉంటాయని, వీటితోపాటు మున్సిపల్, పంచాయతీరాజ్, ప్రభుత్వ పాఠశాలల్లో 1,700 పోస్టులు, స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు 700 వరకు ఉంటాయని చెబుతున్నారు. ఇవన్నీ కలిపి మొత్తం 3,600 వరకు పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక కాంట్రాక్ట్ ప్రాతిపదికన పని చేస్తున్న టీచర్లకు డీఎస్సీలో వెయిటేజీ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వీరికి మినిమం టైం స్కేల్ అమలు చేయాలని నిర్ణయించింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.