AP: రాష్ట్రంలో మరో దారుణం.. కన్నబిడ్డలను క్రూరంగా హతమార్చిన తండ్రి

కన్నబిడ్డలను కడుపులో పెట్టుకుని కాపాడుకోవాల్సిన తండ్రే వారి పాలిట మృత్యువుగా మారిన ఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని కాకినాడ (Kakinada)లోని సుబ్బారావు నగర్‌ (Subbarao Nagar)లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. తాడేపల్లిగూడేని (Tadepallygudem)కి చెందిన చంద్ర కిశోర్ (Chandra Kishore) వాకలపూడి (Vakalapudi)లోని ఓఎన్‌జీసీ (ONGC)లో అసిస్టెంట్ అకౌంటెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడు భార్య తనూజ (Tanuja), ఇద్దరు కుమారులతో కలిసి సుబ్బారావు నగర్‌లో నివాసం ఉంటున్నాడు.


శుక్రవారం హోలీ పండుగ కావడంతో వేడుకల్లో పాల్గొనేందుకు తన కుటుంబాన్ని చంద్ర కిషోర్ తన ఆఫీసుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే పిల్లలకు యూనిఫాం కొలతలు తీయించేందుకు టైలర్ వద్దకు తీసుకెళ్తున్నానని చెప్పి, భార్యను ఆఫీస్‌లోనే ఉండమని నమ్మించి చంద్ర కిషోర్ ఇంటికి వెళ్లాడు. అనంతరం కుమారులు జోషిత్ (7), నిఖిల్ (6) కాళ్లు, చేతులు కట్టేసి అతి క్రూరంగా వారి తలలను బకెట్‌లో ముంచేసి చంపేశాడు. అనంతరం సూసైడ్ నోట్ (Suicide Note) రాసి తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమయం గడుస్తున్నా.. ఎంతసేపటికీ భర్త రాకపోవడంతో తోటి ఉద్యోగులతో కలిసి ఇంటికి వెళ్లిన తనూజ ఇంటి కిటికీలోంచి చూడగా భర్త, పిల్లలు విగతజీవులుగా కనిపించారు.

అయితే, ఆ సూసైడ్ నోట్‌ (Suicide Note)లో ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో తన పిల్లలు రాణించలేరని, వారికి భవిష్యత్తు లేనందునే వారని చంపి.. తాను కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లుగా చంద్ర కిషోర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ఘటన ఆంధ్ర రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది.