షామిలీ… ఈ పేరుని దక్షిణాదిన ఎవరు విన్నా… ‘బేబి షామిలీ’ అనేస్తారు. పసితనం దాటి, పెరిగి పెద్దయినా, హీరోయిన్‌గా మారినా ఇప్పటికీ అదే ఆమె పేరు. అంతలా బాలనటిగా అందరి మనసుల్లో ముద్ర వేసిన ఆమె… ఇప్పుడు వేరే రంగంలోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
‘అంజలి’… ఈ సినిమానీ, నాలుగేళ్ల వయసులో మానసిక స్థితి సరిగాలేని చిన్నారిగా షామిలీ నటననీ ఎవరూ మర్చిపోలేరు. కాబట్టే, అంతచిన్న వయసులోనే జాతీయ అవార్డునీ అందుకున్నారామె. నిజానికి ఆమె నటనా జీవితం పూర్తిగా రెండేళ్లు కూడా రాకముందే ప్రారంభమైంది. షామిలీ పుట్టిపెరిగింది చెన్నైలో. తల్లిదండ్రులు అలిస్, బాబు. నటన మీద ఆసక్తితో ఆమె తండ్రి మద్రాస్‌కి మారారు. కానీ ఆ కల నెరవేరక పిల్లలను ఆ వైపుగా ప్రోత్సహించారు. అలా అక్క షాలినీతోపాటు సినిమాల్లోకి అడుగు పెట్టారు షామిలీ. బాలనటిగా దక్షిణాదిన అన్ని భాషల్లో, స్టార్ హీరోలతో నటించారు. ఒకరకంగా బాలనటిగా దక్షిణాదిన ఆధిపత్యం ప్రదర్శించారు. అప్పట్లో ఎక్కువ సంపాదన ఉన్న అమ్మాయి. కేరళ, కర్ణాటక రాష్ట్రీయ అవార్డులు సహా ఎన్నో పురస్కారాలూ అందుకున్నారు.
దాదాపు 70 సినిమాల్లో బాలనటిగా నటించిన షామిలీ తరవాత వాటిని పక్కన పెట్టేశారు. ‘స్కూలు, కాలేజీల్లో నటించడానికి అనుమతి ఇవ్వలేదు’ అంటారామె. కాబట్టే, చదువయ్యాక దాదాపు 12 ఏళ్ల తరవాత తిరిగి సినిమాల్లోకి అడుగుపెట్టారు. తెలుగు, తమిళ, మలయాళ అవకాశాలు వచ్చాయి. ‘ఓయ్’కి ‘బెస్ట్ ఫిమేల్ డెబ్యూ’ అవార్డునీ అందుకున్నారు. అయితే అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే… ఆమె ఆర్ట్స్ వైపు వెళ్లడం. ‘నటనంటే ఇష్టమే. కానీ దానికే పరిమితం అవ్వాలని నేనెప్పుడూ అనుకోలేదు. డ్యాన్స్ నేర్చుకున్నా, పర్యటనలంటే ఇష్టం. నచ్చిన ప్రాంతాలు చుట్టేదాన్ని. నేను విజువల్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ చేశా. ఆపై సింగపూర్‌లో ఫిల్మ్ ప్రొడక్షన్‌లో డిప్లొమా చేస్తున్నప్పుడు ఆర్ట్ వైపునకి మనసు మళ్లింది’ అనే షామిలీ… పారిస్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. చైనీస్ ఇంక్ పెయింటింగ్, ఇటలీలోని అకడమియా రియాచి ఇన్ ఫ్లోరెన్స్ నుంచి గ్లాస్ పెయింటింగ్, డిజిటల్ ఆర్ట్స్ వంటివీ నేర్చుకున్నారు. ప్రముఖ ఆర్టిస్ట్ ఏవీ ఇలాంగో ఆమెకు మెంటార్.
‘సినిమాలు చేస్తూనే ఆర్ట్‌నీ కొనసాగించా. ఏమాత్రం ఖాళీ దొరికినా క్యారవ్యాన్‌లో కూర్చుని బొమ్మలు గీసేదాన్ని. చాలామంది ‘ఇప్పుడు ఆర్ట్ ఎందుకు? తరవాత ఎప్పుడైనా ప్రయత్నించొచ్చుగా’ అనేవారు. నేను మాత్రం వదల్లేదు. కొన్ని సినిమాలు వదులుకున్నా. మధ్యలో కొన్ని చేసినా… మళ్లీ ఆర్ట్‌వైపే వెళ్లాను. ఒక్కోసారి ప్యాషనే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అందుకు నేనే ఉదాహరణ. మా ఇంట్లో ఆర్టిస్టులు ఎవరూ లేరు. అయినా ఆర్ట్‌ని చూడగానే ప్రేమలో పడిపోయా. చుట్టూ ఉన్న ప్రతిదీ నాలో స్ఫూర్తిని రగులుస్తుంది’ అంటారు షామిలీ.
ఫిగరేటివ్ పెయింటింగ్ ఆమె ప్రత్యేకత. మహిళా చిత్రాలు, రోజువారీ కార్యకలాపాలు, భావోద్వేగాలు వంటివాటికి ఆమె చిత్రాల్లో ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. తన చిత్రాలతో ఎగ్జిబిషన్లనీ ఏర్పాటుచేశారు. 2023లో ‘షీ’ పేరుతో చెన్నైలో సోలో ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఆపై వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో నిర్వహించిన వరల్డ్ ఆర్ట్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్‌లోనూ పాల్గొన్నారు. ‘పవర్ బైనరీ’ పేరుతో బెంగళూరులో మరో షో చేశారు. ఆర్టిస్ట్‌గా తనదైన ముద్ర వేస్తున్నారు. ఇంకా ఎన్నో దేశాల్లో ఎగ్జిబిషన్లు నిర్వహించడం ఆమె కల అట. భవిష్యత్తులో సినిమాలు నిర్మించే ఆలోచనలోనూ ఉన్నారట. మొత్తానికి ఒకప్పటి బుల్లిస్టార్… నేడు పెద్ద ఆర్టిస్ట్‌గా దూసుకెళ్తున్నారన్నమాట.


































