ఏపీలో బీసీ, ఈబీసీ కార్పోరేషన్ లోన్లు

ఏపీలో బీసీ, ఈబీసీ కార్పోరేషన్ల రుణాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇప్పటికే ఈ రెండు కార్పోరేషన్లలో స్వయం ఉపాధి పథకాలకు రుణాల కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది.


ఈ నెల 22తో గడువు ముగియనుంది. కాబట్టి ఆ లోపు ఈ రెండు కార్పోరేషన్ల రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. అలాగే దరఖాస్తు ఎలా చేసుకోవాలి, అర్హతల వివరాలను కూడా అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.

రాష్ట్రంలో బీసీ, ఓబీసీ కార్పోరేషన్లలో స్వయం ఉపాధి పథకాలతో పాటు జనరిక్ మందుల షాపుల కోసం సబ్సిడీ రుణాల మంజూరుకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సబ్సిడీ రుణాల కోసం రాష్టవ్యాప్తంగా బీసీలు దరఖాస్తుచేసుకునేందుకు అవకాశం కల్పించారు. మొత్తం 52 రకాల స్వయం ఉపాధి యూనిట్లను స్థాపించుకునేందుకు ఈ దరఖాస్తులు కోరుతున్నారు. వీటితో పాటు రూ.8 లక్షల యూనిట్‌ విలువతో జనరిక్‌ మందుల దుకాణాలను ఏర్పాటు చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించారు. ఈ నెల 22వ తేదీ వరకూ ఓబీఎంఎంఎస్‌ పోర్టల్‌ ద్వారా రుణాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తారు.

https://apobmms.apcfss.in/ పోర్టల్ లోకి వెళ్లి బీసీ, ఓబీసీ కార్పోరేషన్లకు అర్హులైన వారు రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు. పోర్టల్ లోకి వెళ్లి ప్రాథమిక వివరాలు నమోదు చేసుకుంటే యూజర్ నేమ్, పాస్ వర్డ్ జనరేట్ అవుతాయి. యూజర్ ఐడీగా మొబైల్ నంబర్ ఇస్తే దానికి వచ్చే ఓటీపీ పాస్ వర్డ్ గా ఉపయోగించాలి. అనంతరం దాన్ని మార్చుకోవచ్చు. ఆన్ లైన్ దరఖాస్తులో దరఖాస్తుదారు అడ్రస్, కులం, ఇతర వివరాలు నమోదు చేసి ప్రింట్ తీసుకోవాలి.

బీసీ,ఈబీసీ కార్పోరేషన్ రుణాల కోసం ఏపీలోని బీసీ కులానికి చెందిన 21 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కులు ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వీరు కచ్చితంగా పేదలు అయి ఉండాలి. రవాణా సంబంధిత పథకాలకు దరఖాస్తు చేస్తుంటే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. జనరిక్ ఫార్మా పథకాలకు దరఖాస్తు చేసే వారు డీ-ఫార్మసీ లేదా బీఫార్మసీ లేదా ఎం ఫార్మసీ డిగ్రీ కలిగి ఉండాలి.