విద్యార్ధుల వీపులు పగిలేలా కొట్టిన హెడ్ మాస్టర్.. ఆ తర్వాత సీన్‌ ఇదే!

ఖమ్మం, ఫిబ్రవరి 18: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్ల జిల్లా పరిషత్‌ ప్రభుత్వ పాఠశాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాఠశాల ఎదుట విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తమ పిల్లలను ప్రధానోపాధ్యాయురాలు నాగమణి విచక్షణ రహితంగా కర్రతో కొట్టారంటూ ఆందోళనకు దిగారు. శివరాత్రి సందర్భంగా సోమవారం జరిగిన రేజర్ల గ్రామంలో సత్తెమ్మ తల్లి జాతరకు పాఠశాలలో చదువుతున్న కొందరు పిల్లలు వెళ్లారు. ఆ రోజు పాఠశాలకు 15 మంది విద్యార్ధులు గైర్హాజరైనారు. దీంతో మరుసటి రోజు ప్రధానోపాధ్యాయురాలు నాగమణి కర్రతో కొట్టారని పిల్లల తల్లిదండ్రులు స్కూలు ముందు ఆందోళనకు దిగారు. పిల్లల ఒంటిపై వాతలు పొంగేటట్లు ఎందుకు కొట్టారంటూ హెడ్ మాస్టర్‌తో వాగ్వాదానికి దిగారు.


ఈ విషయం పై ప్రధానోపాధ్యాయులు నాగమణిని వివరణ కోరగా పిల్లలు స్కూలుకు రాకపోవడంతో తాను దండించానని.. కర్రతో కొట్టడం తప్పైందని ఆమె వివరణ ఇచ్చారు. ఘటన స్థలానికి హుటాహుటిన మండల విద్యాశాఖ అధికారి నక్కా రాజేశ్వరరావు చేరుకొన్నారు. అక్కడి విద్యార్థులు, పేరెంట్స్‌ను అడిగి పూర్తి నివేదికను తయారుచేసి జిల్లా విద్యాశాఖ అధికారులకు అందజేస్తానని హామీ ఇవ్వడంతో వ్యవహారం సర్దుమనిగింది.

 

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.