ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఏపీలో ఎల్లుండి నుంచి వర్షాలు పడనున్నాయి. మొన్నటి వరకు చలి తీవ్రత ఉండగా… ఇప్పుడు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఈ నెల 21వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ప్రభావంతో ఎల్లుండి నుంచి ఏకంగా మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి.
ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు
ఈ అల్ఫపీడనం ఎఫెక్ట్ వల్ల రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఎల్లుండి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీ నుంచి రెండు రోజుల పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలో వర్షాలు ఉంటాయని స్పష్టం చేసింది. అటు రానున్న 24 గంటల్లో కోస్తాలోని పలు జిల్లాలలో పొగ మంచు కురుస్తుందని పేర్కొంది. దానికి తోడు స్వల్పంగా ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా నమోదు అవుతాయట. అయితే మూడు రోజులపాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని వెల్లడించింది వాతావరణ శాఖ. కాగా మొన్న శివరాత్రి వరకు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో విపరీతంగా చలి తీవ్రత ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు క్రమ క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మార్చి మొదటి వారం వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎండలు దంచి కొట్టే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు.

































