1,00,000 డాలర్లకు బిట్‌కాయిన్‌

www.mannamweb.com


క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌ (Bitcoin) విలువ నేడు ఏకంగా 1,00,000 (రూ.84 లక్షలకు పైగా) డాలర్లను దాటేసింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నిక కావడంతో కొన్నాళ్లుగా ఇది భారీగా ర్యాలీ చేస్తున్న విషయం తెలిసిందే.

గత నాలుగు వారాల్లోనే దీని విలువ 45శాతం పెరిగిందంటే దీని దూకుడు అర్థం చేసుకోవచ్చు. క్రిప్టో కరెన్సీ విషయంలో నిబంధనలను సడలిస్తానని ట్రంప్‌ సంకేతాలు ఇచ్చిన కొన్ని గంటల్లోనే ఇది 1,00,000 డాలర్ల మార్కును దాటేసింది. ఒక దశలో అత్యధికంగా 1,00,512ను తాకింది.

మడ్‌రెక్స్‌ సీఈవో ఈ పరిణామాలపై స్పందిస్తూ..”బిట్‌కాయిన్‌ దూకుడు వెనక మస్క్‌కు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియన్సీ సామర్థ్యం కట్టబెట్టడం వంటి కారణాలు ఉన్నాయి. దీంతోపాటు అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్‌ఛేంజీ కమిషన్‌(ఎస్‌ఈసీ) ఛైర్మన్‌గా పాల్‌ అట్కిన్‌కు ట్రంప్‌ బాధ్యతలు అప్పగించడం వంటివి కలిసొచ్చాయి. దీంతో క్రిప్టో అనుకూల పాలసీలు వస్తాయన్న అంచనాలు బలపడ్డాయి. భవిష్యత్తులో బిట్‌కాయిన్‌ 1,20,000 డాలర్లకు కూడా చేరే అవకాశం ఉంది” అని పేర్కొన్నారు.

గతంలో పాల్‌ అట్కిన్‌ గతంలో జార్జ్‌ డబ్ల్యూ బుష్‌ హయాంలో కూడా ఎస్‌ఈసీ బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత పదవిని వీడాక అమెరికాలో మార్కెట్‌ నియంత్రణ చాలా తీవ్రంగా ఉందని న్యాయపోరాటం చేశారు. తాజాగా మళ్లీ ఆయనకే ట్రంప్‌ ఎస్‌ఈసీ పగ్గాలు అప్పజెప్పడం విశేషం. అమెరికా ఎన్నికల రోజున బిట్‌కాయిన్‌ విలువ 69,374 డాలర్లుగా ఉంది. రెండేళ్ల క్రితం 17,000 డాలర్ల దిగువకు జారిపోయిన ఈ క్రిప్టో కరెన్సీ ఇప్పుడు లక్ష డాలర్లను దాటేయడం విశేషం.