బంగారం ధరలు ఈ రోజు కాస్త తగ్గుముఖం పట్టాయి. కొంతకాలంగా స్థిరంగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు తగ్గి పసిడి ప్రియులకు ఊరటనిచ్చాయి. అయితే యుద్ధం తీవ్రంగా మారుతున్న తరుణంలొ మార్కెట్లో స్వల్ప క్షీణత, మందగమనం పసిడి ర్యాలీ ఎందుకు ఆగిపోయిందో పెట్టుబడిదారులను ఆశ్చర్యపరిచేలా చేసింది. పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా మారిన తరుణంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడం నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఈ తగ్గుదల వెనుక అనేక ప్రధాన అంశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని నిపుణులు అంటున్నారు.
ముందుగా ట్రేడింగ్ ఖరీదు పెరగడం ప్రధాన అంశంగా ఉంది. ప్రధాన ఎక్స్ఛేంజీలలో మార్జిన్ పెరుగుదల వలన బంగారం కొనుగోలు ఖర్చులు ఎక్కువ అయ్యాయి. ఇది పెట్టుబడిదారుల ఉత్సాహాన్ని తగ్గించి, మార్కెట్‌లో కొత్త కొనుగోళ్ల వేగాన్ని మందగించింది.అలాగే స్టాక్ మార్కెట్ అస్థిరత కూడా Gold ధరలపై ప్రభావం చూపింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధ భయాలు స్టాక్ మార్కెట్లలో నష్టాలు సృష్టించాయి. ఈ నష్టాలను పూరించడానికి కొందరు పెట్టుబడిదారులు బంగారం, వెండిని విక్రయించటంతో బులియన్ మార్కెట్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
అలాగే, పెట్టుబడిదారులు కొంత విరామం తీసుకోవడం కూడా ధరల స్థిరత్వానికి కారణమైంది. గతంలో బంగారం ధర భారీగా పెరిగింది. కానీ ఇప్పుడు కొత్త పెద్ద కొనుగోళ్లు తగ్గడం వల్ల ధరలు ఇరుకైన పరిధిలో కదలుతున్నాయి.అయితే భారతదేశంలో Gold డిమాండ్ పూర్తిగా తగ్గలేదు. వివాహాలు, పండుగ సీజన్ సమీపిస్తుండటం వల్ల.. ఆభరణాల కొరకు కొనుగోళ్లు పెరుగుతాయని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇది ధరలకు ప్రస్తుత స్థాయిలో మద్దతు ఇస్తుంది.
ప్రస్తుత పరిస్థితుల్లో బలమైన US డాలర్ కూడా బంగారం లాభాలను కొంత తగ్గిస్తోంది. బలమైన డాలర్ సాధారణంగా అంతర్జాతీయ బంగారం డిమాండ్‌ను తగ్గించి, ధరలపై ఒత్తిడిని కలిగిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం 5 వేల డాలర్ల వద్ద బలమైన మద్దతు పొందుతుండగా.. 5400 డాలర్ల వద్ద ప్రధాన నిరోధాన్ని ఎదుర్కొంటోంది. దేశీయంగా, రూపాయి బలహీనత కొంత మద్దతును ఇస్తుంది, అయితే మార్కెట్ సెంటిమెంట్ ఇంకా కొద్దిగా బలహీనంగా ఉంది. అందువల్ల ప్రస్తుతానికి బంగారం రూ.1,55,000 నుంచి రూ. 1,65,000 మధ్య ట్రేడవచ్చుందని అనుకుంటున్నారు.
కమోడిటీ నిపుణుడు అనుజ్ గుప్తా చెప్పిన వివరాల ప్రకారం.. బంగారం, వెండి ప్రస్తుతానికి పక్కదారి (sideways) ధోరణిలో ఉన్నాయి. యుద్ధానికి సంబంధించిన అనిశ్చితి కారణంగా భారతదేశం, UAE వంటి మార్కెట్లలో బంగారు ఆభరణాల డిమాండ్ కొద్దిగా మందగించిందని.. పెట్టుబడిదారులు వేచి చూసే వ్యూహాన్ని అవలంబిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే దీర్ఘకాలిక చిత్రం ఇంకా బలంగా ఉంది.
అనుజ్ గుప్తా అంచనాల ప్రకారం.. 2026 దీపావళి వరకు బంగారం 5500 నుంచి 5600 డాలర్ల మధ్యలో కదలాడే అవకాశం ఉంది. వెండి 100 డాలర్ల నుంచి 110 డాలర్ల వరకు చేరే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే ప్రస్తుతానికి మార్కెట్ ప్రశాంతంగా ఉన్నప్పటికీ.. భవిష్యత్తులో ఒక పెద్ద కదలిక వస్తుందని, పెట్టుబడిదారులు దీని కోసం సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. బంగారం ధరల ర్యాలీ తాత్కాలికంగా ఆగినప్పటికీ.. దీర్ఘకాలిక దృష్ట్యా బుల్లిష్ ట్రెండ్ కొనసాగుతుందని స్పష్టంగా కనిపిస్తుంది.

































