ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను తెలిపాడు. అటువంటి వాటిల్లో ఒకటి కొంతమంది వ్యక్తులకు వీలైనంత త్వరగా మిమ్మల్ని మీరు దూరం చేసుకోవాలని ప్రత్యేకంగా ప్రస్తావించాడు.
ఇలాంటి వ్యక్తి మీ జీవితంలో ఉంటే.. మీరు విజయం సాధించడం మరింత కష్టతరం అవుతుంది.. లేదా అసాధ్యం అవుతుందని చాణక్యుడు చెప్పాడు. ఆచార్య చాణక్యుడి ప్రకారం అలాంటి వ్యక్తులు మీకు.. మీ విజయానికి మధ్య అతిపెద్ద అడ్డంకిగా మారతారు. మీరు సమయానికి వారి నుంచి దూరంగా వెళ్ళకపోతే.. తరువాత జీవితాంతం పశ్చాత్తాపపడాల్సి ఉంటుంది.ఈ రోజు మీరు వీలైనంత త్వరగా మీ నుంచి దూరం చేసుకోవాల్సిన వ్యక్తుల గురించి తెలుసుకుందాం..
ప్రతికూలంగా ఆలోచించే వ్యక్తులకు దూరంగా ఉండండి.
ఆచార్య చాణక్యుడి ప్రకారం ప్రతికూల ఆలోచనలు ఉన్న ఎవరికైనా సరే దూరంగా ఉండాలి. ఇలాంటి వ్యక్తులు మీరు చేసే ప్రతి పనిలోనూ తప్పులు వెతుకుతారు.. మనోధైర్యాన్ని బలహీనపరుస్తారు. ప్రతి పనికి అడ్డంకిగా నిలుస్తారు. కనుక వీలైనంత త్వరగా ఇలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తుల నుంచి మిమ్మల్ని దూరం చేసుకుని.. సానుకూల ఆలోచనలు చేసే వ్యక్తులతో స్నేహం చేయడం మొదలు పెట్టండి.
సోమరితనం ఉన్నవారికి దూరంగా ఉండండి
చాణక్య నీతి ప్రకారం సోమరితనం ఉన్న వ్యక్తులకు వీలైనంత దూరంగా ఉండాలి. ఇలాంటి వ్యక్తులు జీవితంలో విజయం సాధించరు లేదా మిమ్మల్ని విజయం సాధించేలా ప్రోత్సహించరు. వీరికి ఉండే ఏకైక నైపుణ్యం అడ్డంకిగా మారడం. కష్టపడి పనిచేయడానికి వెనుకాడతారు. కష్టపడేవారిని కూడా తప్పుదారి పట్టిస్తారు. కనుక ఇలాంటి వ్యక్తులతో సహవాసం చేస్తే.. జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేరు.
ఇతరుల పురోగతిని చూసి అసూయపడే వ్యక్తులు
ఇతరుల పురోగతిని చూసి అసూయపడే వ్యక్తులకు దూరంగా ఉండాలని ఆచార్య చాణక్యుడు సలహా ఇచ్చాడు. అలాంటి వ్యక్తులు మీరు జీవితంలో విజయం సాధించడం చూసి అసూయపడతారు. ఈ అసూయ కారణంగా మీరు జీవితంలో విజయం సాధించకుండా నిరోధించడానికి ప్రయత్నిస్తారు.
నమ్మకాన్ని దెబ్బతీసే వ్యక్తులకు దూరంగా
మీరు జీవితంలో విజయం సాధించాలనుకుంటే.. మీకు ద్రోహం చేసే లేదా నమ్మకద్రోహం చేసే వ్యక్తులకు దూరంగా ఉండాలని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు. అలాంటి వ్యక్తులు అవసరమైన సమయంలో మిమ్మల్ని మోసం చేస్తారు. అంతేకాదు వీరు తమ సొంత శ్రేయస్సు గురించి మాత్రమే శ్రద్ధ వహిస్తారు.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.
































