12న ఉదయం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణం
గన్నవరం శివారు కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో సభ?
ప్రధాని మోదీ, పలువురు సీఎంల రాక నేపథ్యంలో భారీ భద్రత
12 హెలిప్యాడ్‌లు.. లక్షన్నర మందికి సరిపడా ఏర్పాట్లు
సభ ఏర్పాట్లపై చర్చిస్తున్న తేదేపా నేతలు అచ్చెన్నాయుడు, టీడీ జనార్థన్ తదితరులు
ఈనాడు-అమరావతి, తాడేపల్లి, గన్నవరం గ్రామీణం న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న ఉదయం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా విజయోత్సవ సభ కూడా నిర్వహించనున్నారు. ప్రధాని మోదీతోపాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కూటమి నేతలు హాజరు కానున్నారు. వేదిక ఎక్కడనేది ఇంకా నిర్ణయించలేదు. పలువురు ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో 12 హెలిప్యాడ్‌లు, గ్యాలరీలు, రవాణా ఏర్పాట్లు చేపట్టాల్సి ఉంటుంది. సభ నిర్వహణ కోసం గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్, మంగళగిరి ఎయిమ్స్ సమీపంలో బ్రహ్మానందపురం ఏసీసీ భూములను అధికారులు, తెదేపా నేతలు పరిశీలించారు. ఐటీ పార్క్ వద్ద స్థలాలు అనుకూలంగా ఉన్నాయని, అక్కడైతే 1.5 లక్షల వరకు ప్రజలు వీక్షించేందుకు అవకాశం ఉంటుందని అంచనా వేశారు. ప్రధాని మోదీ సహా వివిధ రాష్ట్రాల నేతలు హాజరు కానున్న నేపథ్యంలో.. భద్రత, రవాణా, ప్రజలకు సౌకర్యాల పరంగా ఐటీ పార్కు సమీపంలోని స్థలాల్లో అయితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. విమానాశ్రయానికి ఎదురుగా చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఎనిమిది ఎకరాల స్థలాన్ని పరిశీలించి.. అక్కడ ముళ్ల కంపలను తొలగించాలని నాయకులకు సూచించారు. చంద్రబాబు తుది నిర్ణయం మేరకు ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.
ప్రతి విశిష్ఠ అతిథికి ఒక్కో బృందం
చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ ప్రసాద్ శుక్రవారం సాయంత్రం సమీక్షించారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడితోపాటు కృష్ణా జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో చర్చించారు. ‘ప్రధాని మోదీ హాజరవుతున్న నేపథ్యంలో.. భద్రతాపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డీజీపీతో చర్చించాం. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు. ప్రొటోకాల్ పరంగా వారికి కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రత్యేక బృందాలను ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి విశిష్ఠ అతిథికి ఒక్కో బృందం ప్రొటోకాల్ ఏర్పాట్లు చూస్తుంది’ అని నీరభ్ కుమార్ ప్రసాద్ చెప్పారు. ‘గన్నవరం, మంగళగిరి ప్రాంతాల్లో స్థలాలు పరిశీలించాం. కాబోయే ముఖ్యమంత్రి నుంచి నిర్ణయం రాగానే.. యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంది’ అని తెలిపారు. విజనరీ లీడర్‌గా గుర్తింపు పొందిన చంద్రబాబు వద్ద సీఎస్‌గా పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు.
సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకార ఏర్పాట్లపై తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో
సమావేశమైన తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు. చిత్రంలో సీఎస్ నీరభ్‌కుమార్ ప్రసాద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా
పరిశీలించిన అచ్చెన్నాయుడు, టీడీ జనార్దన్
ప్రమాణ స్వీకార ఏర్పాట్లలో భాగంగా.. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని బ్రహ్మానందపురం ఏసీసీ భూములను అచ్చెన్నాయుడు, టీడీ జనార్దన్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. అధికారులు రూపొందించిన రేఖా చిత్రాన్ని చూశారు. రహదారి మార్గాలపై వివరాలు తెలుసుకున్నారు. ‘హెలిప్యాడ్లు వేదికకు సమీపంలో ఉండాలి. సభా వేదిక, గ్యాలరీలు ఏర్పాటు చేయాలి. కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు చేస్తాం’ అని అచ్చెన్నాయుడు చెప్పారు. అనంతరం గన్నవరం విమానాశ్రయం ఎదురుగా ఉన్న స్థలాన్ని పరిశీలించారు. అక్కడైతే ప్రముఖుల రాకపోకలకు ఇబ్బంది ఉండదని, ఏర్పాట్లు చేయొచ్చని అధికారులు వివరించారు.