Nara Lokesh: వాట్సప్‌లో ఫిర్యాదు.. దివ్యాంగ విద్యార్థుల సమస్యను పరిష్కరించిన మంత్రి లోకేశ్‌

www.mannamweb.com


Nara Lokesh: వాట్సప్‌లో ఫిర్యాదు.. దివ్యాంగ విద్యార్థుల సమస్యను పరిష్కరించిన మంత్రి లోకేశ్‌

అమరావతి: ఇంటర్‌ మార్కుల జాబితాలో దివ్యాంగ విద్యార్థుల సమస్య పరిష్కారానికి ప్రత్యేక జీవో విడుదల చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో దివ్యాంగుల కోటాలో 170వ ర్యాంకు సాధించిన విజయవాడకు చెందిన మారుతీ పృథ్వీ సత్యదేవ్‌.. ఇంటర్‌ సర్టిఫికెట్‌ అప్‌లోడ్‌ విషయంలో ఎదురైన సమస్యను వాట్సప్‌ ద్వారా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సత్యదేవ్‌కు వచ్చిన ర్యాంకు ప్రకారం చెన్నయ్‌ ఐఐటీలో సీటు రావాల్సి ఉంది.

అయితే, దివ్యాంగ విద్యార్థులకు మినహాయింపు పొందిన సబ్జెక్టుకు సంబంధించి సర్టిఫికెట్‌లో ఇంటర్‌ బోర్డు ఎప్పటి నుంచో ‘E’ (EXEMPTION) అని మాత్రమే పేర్కొంటూ జారీ చేస్తున్నారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటర్మీడియట్ మెమో సర్టిఫికెట్‌ని అప్‌లోడ్ చేయగా… మెమోలో కేవలం నాలుగు సబ్జెక్టులు మాత్రమే ఉన్నాయని, మ్యాథ్స్ ఎ, మ్యాథ్స్ బిలను ఒకే సబ్జెక్ట్‌గా పరిగణిస్తున్నామని, అందువల్ల ఇంటర్మీడియట్ పత్రాన్ని అంగీకరించబోమని సమాచారమిచ్చారు. దీనిపై సత్యదేవ్ ఐఐటి మద్రాసుని సంప్రదించగా, సెకండ్ లాంగ్వేజ్ సబ్జెక్టుకు సంబంధించిన సర్టిఫికెట్‌లో ‘E’ స్థానంలో నిర్దిష్ట సంఖ్యా విలువను కలిగి ఉంటేనే కళాశాలలో ప్రవేశానికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని మంత్రి లోకేష్‌ దృష్టికి తీసుకెళ్లగా.. వెంటనే స్పందించిన లోకేశ్‌ సంబంధిత విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి చొరవతో మొత్తం 25 మంది దివ్యాంగ విద్యార్థులకు దేశవ్యాప్తంగా పేరెన్నిక గన్న ఐఐటీ, ఎన్ఐటీ వంటి విద్యాసంస్థల్లో ప్రవేశాలు లభించాయి. సోమవారం ఉండవల్లిలోని తన నివాసంలో 25 మంది దివ్యాంగ విద్యార్థులను మంత్రి అభినందించనున్నారు.