అమెరికాలోని టెక్సాస్ నగరంలో ఉన్న హిందూ దేవుడి విగ్రహంపై మాగా (MAGA) మద్దతుదారుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విగ్రహం ఏర్పాటును భారతీయ వలసదారుల దండయాత్రకు నిదర్శనమని అభివర్ణిస్తూ ఆయన చేసిన పోస్టుపై తీవ్ర దుమారం రేగుతోంది.
టెక్సాస్‌లోని హూస్టన్ నగరంలో శ్రీఅష్టలక్ష్మి ఆలయంలో 90 అడుగుల హనుమాన్ కాంస్య విగ్రహం (Hanuman statue in Texas) ఉంది. ‘స్టాచ్యూ ఆఫ్ యూనియన్’గా పిలిచే ఈ హనుమాన్ విగ్రహం ఉత్తర అమెరికాలోనే అత్యంత ఎత్తయినది. ఈ విగ్రహానికి సంబంధించిన వీడియోను మాగా మద్దతుదారుడు కార్లోస్ టుర్సియోస్ (Carlos Turcios) ఎక్స్ వేదికగా పోస్టు చేశాడు. వలసదారులు టెక్సాస్, అమెరికాను ఆక్రమించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అమెరికాలో హిందూ విగ్రహం ఎందుకని ప్రశ్నించారు. ఈ దండయాత్రను ఆపాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
కార్లోస్ వ్యాఖ్యలను ఆలయానికి చెందిన కమ్యూనిటీ సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఇది ప్రైవేటు ప్రాపర్టీ అని.. విరాళాలు సేకరించి దీన్ని ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. నెటిజన్లు సైతం కార్లోస్ వ్యాఖ్యలను ఖండిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. కాగా.. ఇదే విగ్రహంపై గతంలో రిపబ్లికన్ పార్టీ నేత అలెగ్జాండర్ డంకన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి హిందూ విగ్రహాన్ని ఇక్కడ మేమెందుకు అనుమతించాలంటూ పేర్కొన్నారు. డంకన్ వ్యాఖ్యలను హిందూ అమెరికన్ ఫౌండేషన్ తీవ్రంగా ఖండించింది.


































