Costly Train: ఈ రైలులో ప్రయాణించాలంటే ఒక్క రాత్రికి రూ.2 లక్షలు చెల్లించాల్సిందే

భారతదేశంలో ట్రైన్ ప్రయాణం అంటే చాలా చవక అనే భావనే ఎక్కువ మందిలో ఉంటుంది. కానీ ఒక ట్రైన్ మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. ఈ ట్రైన్లో కేవలం కోటీశ్వరులు మాత్రమే ప్రయాణం చేయగలరు. ఈ ట్రైన్ పేరు Palace on Wheels. ఈ ట్రైన్‌లో ప్రయాణం చేస్తే నిజంగా మహారాజులా ఫీలవ్వడం ఖాయం.లగ్జరీ హోటల్‌లో ఉండే సౌకర్యాలన్నీ ఈ ట్రైన్‌లో ఉంటాయి. అయితే ఇలాంటి ప్రత్యేక సౌకర్యాలు ఉండటం వల్ల దీని ధర కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ప్యాలెస్ ఆన్ వీల్స్‌లో ఒక్క రాత్రి ఉండాలంటే ఎంత ఖర్చవుతుందో తెలుసా? షాకవ్వడం ఖాయం.


ఎన్ని రోజుల టూర్?
ప్యాలెస్ ఆన్ వీల్స్ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధ లగ్జరీ ట్రైన్లలో ఒకటి. రాజస్థాన్ మహారాజుల రాజభవనాల శైలిలో ఈ ట్రైన్‌ను రూపొందించారు. ట్రైన్‌లోని ప్రతి కోచ్‌ను ప్రత్యేకంగా అలంకరించారు. గోడలపై పెయింటింగ్స్, చెక్క పనితనం, క్లాసిక్ ఫర్నిచర్ అన్నీ కలిపి నిజంగా ఒక రాజ మహల్‌లా కనిపిస్తుంది. అందుకే దీనిని కదిలే రాజభవనం అని కూడా పిలుస్తారు. ఈ ట్రైన్ ప్రయాణం సాధారణంగా ఢిల్లీ నుంచి ప్రారంభమవుతుంది. తర్వాత జైపూర్, జైసల్మేర్, జోధ్‌పూర్, ఉదయ్‌పూర్, ఆగ్రా వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను చూపిస్తుంది. మొత్తం 7 రాత్రులు, 8 రోజుల టూర్ ఇది. ప్రతి నగరంలో పర్యాటక ప్రదేశాలను ప్రత్యేక గైడ్‌తో చూపిస్తారు. అందువల్ల ఇది ట్రైన్ ప్రయాణం మాత్రమే కాదు..ఒక పూర్తి లగ్జరీ టూర్ అనుభవంగా చెప్పుకోవాలి.

ఇక ఖర్చెంత?
ప్యాలెస్ ఆన్ వీల్స్‌లో కేబిన్ రకం ఆధారంగా ధరలు మారుతాయి. సాధారణ డీలక్స్ కేబిన్‌లో ఇద్దరు కలిసి ఉంటే ఒక్క వ్యక్తికి సుమారు రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు ఖర్చవుతుంది. ఒకరే ఉంటే ఖర్చు మరింత పెరిగి రూ.1 లక్షకు పైగా పెరగచ్చు. అలాగే సూపర్ డీలక్స్ లేదా సూట్ కేటగిరీ కేబిన్‌లో ఉండాలంటే ఒక్క రాత్రికి రూ.2 లక్షలకుపైగా ఖర్చవుతుంది. అత్యంత లగ్జరీ ప్రెసిడెన్షియల్ సూట్ అయితే ఒక్క రాత్రికి దాదాపు రూ.3 లక్షల వరకు ఖర్చవుతుంది. అంటే సాధారణంగా ఒక చిన్న కుటుంబం ఏడాదంతా బతకడానికి ఖర్చుపెట్టే డబ్బు.. ఇక్కడ ఒక్క రాత్రికే ఖర్చవుతుంది.

ఈ ట్రైన్ ప్రయాణం మొత్తం 7 రాత్రులు ఉంటుంది కాబట్టి మొత్తం టూర్ ఖర్చు కూడా భారీగానే ఉంటుంది. సాధారణ కేబిన్‌లో ఇద్దరు ప్రయాణిస్తే మొత్తం ట్రిప్‌కు సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చవుతుంది. ఒకరే ప్రయాణిస్తే రూ.8 లక్షలకు పైగా వెళ్లొచ్చు. లగ్జరీ సూట్‌లో అయితే మొత్తం ఖర్చు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు కూడా ఉండొచ్చు. సీజన్, కేబిన్ రకం ఆధారంగా ధరల్లో మార్పులు ఉంటాయి. అయితే దీనిలో చాలా సౌకర్యాలు లభిస్తాయి. ట్రైన్‌లోనే లగ్జరీ గది, రోజుకు మూడు పూటలా లగ్జరీ భోజనం, టీ,కాఫీ, పర్యాటక ప్రదేశాల సందర్శన, గైడ్, ట్రాన్స్‌పోర్ట్ ఇలా అన్న ప్యాకేజీలో భాగమే. అదనంగా ట్రైన్‌లో వినోద కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఉంటాయి. అంటే ప్రయాణికుడు ప్రత్యేకంగా ఏదీ ప్లాన్ చేయాల్సిన అవసరం ఉండదు.

ప్యాలెస్ ఆన్ వీల్స్‌ను చాలామంది మూవింగ్ ఫైవ్ స్టార్ హోటల్ అని అంటారు. ప్రతి కోచ్‌కు ప్రత్యేక బట్లర్ సర్వీస్ ఉంటుంది. భోజనం కూడా ఫైవ్ స్టార్ హోటల్ స్థాయిలో ఉంటుంది. సెక్యూరిటీ, కంఫర్ట్, ప్రైవసీ ఇలా అన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అందుకే దీని ధర ఎక్కువైనా… అనుభవం మాత్రం జీవితాంతం గుర్తుండేలా ఉంటుంది. మొత్తానికి, ప్యాలెస్ ఆన్ వీల్స్‌లో ఒక్క రాత్రి ఉండాలంటే కనీసం రూ.70 వేల నుంచి ప్రారంభమై… అత్యంత లగ్జరీ సూట్‌లో అయితే రూ.3 లక్షల వరకు ఖర్చవుతుంది. పూర్తి టూర్ 20 లక్షల రూపాయల వరకు ఖర్చు కావచ్చు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.