పెరుగు ఈ టైమ్‌లో అస్సలు తినొద్దు.. ఎందుకంటే

www.mannamweb.com


ఆహారంలో పప్పు, కూరలతోపాటు చాలా మందికి పెరుగు వేసుకుని తినే అలవాటు ఉంటుంది. కొంతమంది పెరుగుకు బదులు మజ్జిక తీసుకుంటూ ఉంటారు. పాల ఉత్పత్తులు ఇలా ఏ రూపంలో తీసుకున్నా కడుపులో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలున్న వారు పెరుగు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటంటే..

భోజనంలో పెరుగు లేకుంటే చాలా మందికి కడుపు నిండదు. మరికొందరు పెరుగు లేకపోతే మజ్జిగ తాగుతారు. పెరుగు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పెరుగు తినడం వల్ల కాల్షియం, విటమిన్ డి, విటమిన్ బి12 శరీరానికి సమృద్ధిగా అందుతాయి. అయితే కొందరు రాత్రిపూట పెరుగు తినడం అంత మంచిది కాదంటుంటారు. దీనిలో నిజమెంతో ఇక్కడ తెలుసుకుందాం..

నిజానికి, పెరుగు తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కాబట్టి మధ్యాహ్నం పూట తినడం మంచిది. పెరుగు తినడం వల్ల జీర్ణవ్యవస్థలోని మంచి బ్యాక్టీరియాకు మేలు జరుగుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పెరుగులో క్యాల్షియం, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. కండరాల నిర్మాణంలో సహాయపడుతుంది. చర్మాన్ని ఆరోగ్యవంతంగా మార్చుతుంది. శిరోజాలను రక్షిస్తుంది.

అయితే రాత్రి సమయంలో మాత్రం శరీరంలోని జీవక్రియ మందగిస్తుంది. ఇలాంటి సమయాల్లో జీర్ణ సమస్యలు ఉన్నవారు పెరుగు తింటే సమస్యలు పెరిగే అవకాశం ఉంది. పెరుగులో కొవ్వు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి జీర్ణం కావడానికి సమయం పడుతుంది. కాబట్టి జీర్ణ సమస్యలున్నవారు రాత్రిపూట పెరుగు తింటే సమస్యలు పెరుగుతాయి. అలాగే దగ్గు, జలుబు, ఆస్తమాతో బాధపడేవారు రాత్రిపూట పెరుగు తినకపోవడమే మంచిది.

పెరుగును ఉదయం లేదా మధ్యాహ్నం తినవచ్చు. ఈ సమయంలో పెరుగు తింటే తేలికగా జీర్ణమవుతుంది. అయితే శ్వాసకోశ సమస్యలు లేని వారు రాత్రిపూట కూడా పెరుగు తినవచ్చు. ఇలా ఎలాంటి సమస్య లేని వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెరుగు తినవచ్చు. కానీ పెరుగు కొవ్వు లేకుండా ఉంటే ఇంకా మంచిది.

బరువు తగ్గాలనుకునే వారు పెరుగు తినకూడదు. ఇందులో కొవ్వు శాతం ఎక్కువ. స్కిమ్డ్ మిల్క్‌తో తయారైన పెరుగు తినడం మంచిది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. బరువును అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించే వారు స్కిమ్డ్ మిల్క్‌తో చేసిన పెరుగు తీసుకోవాలి. ఇలా పెరుగు తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది.