Delhi High Court | యువతితో శృంగారం.. జాతకాల సాకుతో పెళ్లికి నిరాకరణ.. ఢిల్లీ హైకోర్టు ఏమన్నదంటే..!

అత్యాచారం కేసులో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తికి బెయిల్‌ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) నిరాకరించింది. నిందితుడి బెయిల్‌ పిటిషన్‌ (Bail petition) ను కొట్టివేసింది.
నిందితుడు పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి బాధితురాలితో శారీరక సంబంధం పెట్టుకున్నాడని, ఆ తర్వాత జాతకాలు కలువలేదనే సాకుతో పెళ్లికి నిరాకరించాడని, ఇది భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్‌ 69 ప్రకార తీవ్ర నేరమని, కాబట్టి నిందితుడికి బెయిల్‌ ఇవ్వలేమని, అతడి పిటిషన్‌ను కొట్టివేస్తున్నామని కోర్టు స్పష్టంచేసింది.


వివరాల్లోకి వెళ్తే.. ఒక యువకుడు ఒక యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. మన జాతకాలు బ్రహ్మాండంగా కలిశాయని, త్వరలో పెళ్లి చేసుకుందామని నమ్మబలికి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత యువతి పెళ్లి చేసుకుందామని అడగడంతో అతడు నిరాకరించాడు. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిని, అతడి కుటుంబసభ్యులను పిలిపించి మాట్లాడటంతో.. పెళ్లి చేసుకుంటామని హామీ ఇచ్చి కేసును విత్‌డ్రా చేయించారు.

ఆ తర్వాత కొన్ని రోజులకు జాతకాలు కలువలేదన్న సాకుతో పెళ్లికి నిరాకరించారు. దాంతో బాధితురాలు మళ్లీ కేసు పెట్టింది. జాతకాలు కలిశాయని, పెళ్లి చేసుకుందామని అతడు గతంలో తనకు పంపించిన వాట్సాప్‌ మెసేజ్‌లను పోలీసులకు చూపించింది. దాంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు నిందితుడిని లొంగిపొమ్మని గడువు విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఈ క్రమంలో నిందితుడు బెయిల్‌ కోసం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేశాడు. కేసు పూర్వపరాలను పరిశీలించిన కోర్టు అతడికి బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.