ప్రస్తుత రోజులలో సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఛాన్స్ దొరికితే చాలు అకౌంట్లో డబ్బులు ఖాళీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలోని ఓ రిటైర్డ్ ఉద్యోగికి ఈడీ అధికారుల పేరుతో ఓ ఫోన్ కాల్ వచ్చింది. మీపై కేసు నమోదైందని.. మాఫీ చేయాలంటే రూ.72.50 లక్షలు పంపాలని బెదిరించారు. దీనిపై ఆరా తీసిన పోలీసులు.. అలాంటిదేమీ లేదంటూ సదరు రిటైర్డ్ ఉద్యోగికి భరోసా కల్పించారు. డిజిటల్ అరెస్ట్ మీద అవగాహన కల్పించారు. అయితే 15 రోజుల తర్వాత మళ్లీ అదే తరహా ఫోన్ రావటంతో రిటైర్డ్ ఉద్యోగి తన ఖాతా నుంచి వారికి రూ.49 లక్షలు నగదు బదిలీ చేశారు. ఆ తర్వాత మోసపోయిన సంగతి గ్రహించి పోలీసులను ఆశ్రయించారు.
ఓసారి మోసపోతే అది అమాయకత్వం, రెండోసారి కూడా మోసపోతే అది మూర్ఖత్వం.. అని పెద్దలు ఊరికే చెప్పలేదు. పెద్దలు సంగతి పక్కనపెడితే సాక్షాత్తూ పోలీసులే ఆ వ్యక్తికి ఇలాంటివి నమ్మి భయపడవద్దని సూచించారు. డిజిటల్ అరెస్ట్ అంటూ ఫోన్ వస్తే తమకు చెప్పమని సలహా కూడా ఇచ్చారు. కానీ ఆ పెద్దమనిషి వింటేగా.. అది భయమో, అమాకత్వమో, నిర్లక్ష్యమో.. తెలీదు. రెండోసారి సైబర్ నేరగాళ్ల బుట్టలో పడ్డాడు. రూ.49 లక్షలు పోగొట్టుకుని మళ్లీ పోలీసులను ఆశ్రయించాడు. అలాగని అతనేమీ చదువుకోని వ్యక్తి కాదు. రిటైర్డ్ ఉద్యోగి.. ఈ ఘటనలో విజయవాడలో చోటుచేసుకుంది.
స్టీల్‌ప్లాంటులో పనిచేసిన ఓ ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత విజయవాడలో స్థిరపడ్డారు. అయితే జనవరి నెలాఖరులో అతనికో ఫోన్ వచ్చింది. తాము ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులమంటూ రిటైర్డ్ ఉద్యోగికి ఫోన్ కాల్ వచ్చింది. మీ మీద కేసులు నమోదయ్యాయని అవతలి వ్యక్తి.. రిటైర్డ్ ఉద్యోగిని బెదిరించారు. యూనిఫామ్ ధరించి మరీ వీడియో కాల్ చేయడంతో నిజంగానే ఈడీ అధికారి ఏమోనని రిటైర్డ్ ఉద్యోగి భయపడిపోయాడు. కేసు మాఫీ చేయాలంటే తనకు రూ.72 లక్షల 50 వేలు ఇవ్వాలని అవతలి వ్యక్తి డిమాండ్ చేయడంతో విజయవాడ రిటైర్డ్ ఉద్యోగి భయపడిపోయారు. డబ్బుల కోసం స్థానికంగా ఉన్న ఎస్‌బీఐ బ్యాంకుకు వెళ్లారు.
తన పేరు మీద ఉన్న 78 లక్షల రూపాయలు ఫిక్స్‌డ్ డిపాజిట్లు రద్దు చేసి.. 72 లక్షల 50 వేల రూపాయలను మరో బ్యాంక్ అకౌంట్‌కు బదిలీ చేయాలంటూ రిటైర్డ్ ఉద్యోగి బ్యాంక్ అధికారులను కోరారు. అయితే ఎస్‌బీఐ బ్యాంకు అధికారులు అనుమానం వచ్చి.. ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ అకౌంట్ నంబర్ ఎవరిదా అని ఆరా తీశారు. అది కలకత్తాకు చెందిన అకౌంట్ నంబర్ అని గుర్తించారు. ఆ తర్వాత డిజిటల్ అరెస్ట్ నమ్మవద్దని.. ఫోన్ చేసింది నకిలీ అధికారంటూ రిటైర్డ్ ఉద్యోగికి అవగాహన కల్పించారు. ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే సైబర్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
అయితే పోలీసులు ఇంతలా చెప్పినప్పటికీ రిటైర్డ్ ఉద్యోగి వినిపించుకోలేదు. 15 రోజుల తర్వాత మరోసారి అలాంటి ఫోన్ కాల్ రావటంతో మరింత భయపడిపోయారు. మళ్లీ బ్యాంకు వద్దకు వచ్చిన రిటైర్డ్ ఉద్యోగి, తమ కుటుంబం బెంగళూరుకు వెళ్లిపోతోందని చెప్పి.. ఫిక్స్‌డ్ డిపాజిట్లు క్లోజ్ చేశారు. ఆ డబ్బును తన సేవింగ్స్ అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు.
ఆ తర్వాత మరో బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసిన రిటైర్డ్ ఉద్యోగి.. ఆ అకౌంట్ నుంచి తనకు ఫోన్ చేసిన వ్యక్తి చెప్పిన బ్యాంక్ అకౌంట్‌కు రూ.49 లక్షల రూపాయలు బదిలీ చేశారు. బ్యాంక్ సిబ్బంది అడిగితే తెలిసినవారికి అని చెప్పడం గమనార్హం. అయితే ఇదంతా జరిగిన నాలుగు రోజుల తర్వాత మోసపోయానంటూ మరోసారి పోలీసులను ఆశ్రయించారు రిటైర్డ్ ఉద్యోగి.



































